లోకల్ కు కళ దక్కేనా?

10:48 - January 10, 2017

విశాఖ : మేము పక్కా లోకల్ అంటూ విశాఖ కళాకారులు గళం విప్పుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన విశాఖ ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుండటంతో తమను గుర్తించాలని కళాకారులు డిమాండ్‌ చేస్తున్నారు. లోకల్‌వారిని కాదని నాన్ స్టేట్ కళాకారులను ఎలా ప్రోత్సహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 
కళాకారులు ఆందోళన బాట
ఓవైపు విశాఖ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంటే...మరోవైపు కళాకారులు ఆందోళన బాట పట్టారు. తమను కాదని ఇతర రాష్ట్రాల వారిని తెప్పించడం సరికాదంటున్నారు. అసలే ఆకలి బాధలతో అలమటిస్తున్న కళాకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ...ఇలా చేస్తే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనుభవమున్న సంస్థలను కాదని...తమకు నచ్చిన సంస్థలకే అధికారులు....ఉత్సవాల నిర్వహణను అప్పగిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
ఈనెల  27 నుంచి విశాఖ ఉత్సవ్
విశాఖ ఉత్సవ్‌ను ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు   నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి గతంలో విశాఖకు చెందిన ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకే ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. ఈవెంట్ నిర్వహణలో లోపాలు ఎలా ఉన్నా...ఆ సంస్థలు లోకల్ కళాకారులనే తీసుకున్నారు. అయితే ఇప్పుడు లోకల్‌ టాలెంట్‌ను కాదని ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకోవడానికి ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో కళాకారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలకు ముందు లోకల్‌ టాలెంటన్‌నే వాడుకుంటామని చెప్పే నాయకులు...ఆ సమయం వచ్చేసరికి మాత్రం లోకల్ కళాకారులను పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు. 
విశాఖ ఉత్సవ్‌కు రూ. 2.75 కోట్లు మంజూరు
ఇదిలా ఉంటే విశాఖ ఉత్సవ్  నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.75 కోట్లు మంజూరు చేసిందని అధికారులు చెబుతున్నారు. కానీ అంచనా వ్యయం మాత్రం రూ.3.50 కోట్లుగా అధికారులు  లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఉత్సవాలకు టూరిజం శాఖ టెండర్‌ పిలవగా రెండే రెండు టెండర్లు దాఖలయ్యాయి. వీటిలో ఒకటి హైదరాబాద్‌కు చెందిన వైబ్రీ ఈవెంట్స్‌ సంస్థ, మరొకటి పూణేకు చెందిన ఈ ఫ్యాక్టర్‌ ఈవెంట్స్‌ అండ్‌ ప్రమోషన్స్‌. అయితే  సైమా అవార్డుల ఫంక్షన్‌ వంటి భారీ ఈవెంట్లు నిర్వహించిన అనుభవం వైబ్రీ సంస్థకు  ఉంది. కానీ అధికారులు దాన్ని కాదని పూణేకు చెందిన ఈ ఫ్యాక్టర్‌ సంస్థకు కాంట్రాక్ట్‌ కట్టబెట్టినట్టు తెలుస్తోంది... దీని వెనుక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న చినబాబు ఒత్తిళ్లు పనిచేశాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
ఈవెంట్స్‌ అండ్‌ ప్రమోషన్‌కు అప్పగింత 
ఇటీవలే అట్టర్‌ ఫ్లాప్‌ అయిన విండ్‌ ఫెస్టివల్‌ కాంట్రాక్టును కూడా కౌశిక్‌ ముఖర్జీయే చినబాబు ద్వారా మంత్రాంగం జరిపి ఈ ఫ్యాక్టర్‌ ఈవెంట్స్‌ అండ్‌ ప్రమోషన్‌కు అప్పగించారు. కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టిన ఈ విండ్‌ ఫెస్టివల్‌ ఎవ్వరినీ ఆకర్షించలేకపోయింది. స్వయంగా సీఎం చంద్రబాబు సైతం ఈవెంట్‌ నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ అదే సంస్థకు విశాఖ ఉత్సవాల కాంట్రాక్టు కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది. కేవలం చినబాబు సిఫార్సు మేరకే చేసేది లేక కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా కమిటీ కూడా ఓకే చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Don't Miss