అగ్రిహ్యాకథాన్‌కు ముస్తాబైన విశాఖ

08:39 - November 15, 2017

విశాఖ : సన్న, చిన్నకారు రైతులకు మేలు చేకూర్చేందుకు నేటి నుంచి విశాఖలో అగ్రిహ్యాకథాన్‌ జరుగనుంది.  మూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. బిల్‌గేట్స్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన 50 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. దేశం నలుమూలల నుంచి 300 మంది నిపుణులు, శాస్త్రవేత్తలు సదస్సుకు హారవుతున్నారు.
నేటి అంతర్జాతీయ సదస్సు
అగ్రిహ్యాకథాన్‌కు విశాఖ నగరం ముస్తాబైంది. దేశంలోనే తొలిసారిగా విశాఖ కేంద్రంగా అగ్రిహ్యాకథాన్‌ పేరుతో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు జరుగుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. మన్యంలో సాగయ్యే వివిధ పంటలకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించిన సదస్సు కావడంతో చింతపల్లి వ్యవసాయ, ఉద్యన పరిశోధనా స్థానాలకు చెందిన శాస్త్రవేత్తలు స్థానికంగా సాగయ్యే పంటల నమూనాలు, వివరాలతో పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు విదేశీ  ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 250 మంది వ్యవసాయ విద్యార్థులు, 500 మంది రైతులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
అగ్రిహ్యాకథాన్‌కు పూర్తైన ఏర్పాట్లు
అగ్రిహ్యాకథాన్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సదస్సు జరిగే ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా కడియం నర్సరీల నుంచి తీసుకొచ్చిన భిన్న రకాల మొక్కలతో స్వాగత ద్వారాన్ని తీర్చిదిద్దుతున్నారు.  వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక పరిజ్ఞానం అనుసంధానం తదితర అంశాలపై ఈ సదస్సులో ప్రతినిధులు చర్చించనున్నారు.
మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో అగ్రిహ్యాకథాన్‌ 
మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో అగ్రిహ్యాకథాన్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 17న బిల్‌గేట్స్‌ కూడా సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. బిల్‌గేట్స్‌ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఫౌండేషన్‌ ప్రతినిధులు విశాఖ కలెక్టరేట్‌కు వచ్చారు. భద్రత , వసతి, రవాణా తదితర అంశాలపై చర్చించారు. బిల్‌గేట్స్‌ వస్తుండడంతో నగరమంతా పోలీసులు భద్రతతో నిండిపోయింది.

 

Don't Miss