ఏపీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థుల గెలుపు

09:16 - March 21, 2017

హైదరాబాద్ : ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండుచోట్ల పీడీఎఫ్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి కత్తి నర్సింహారెడ్డి గెలుపొందారు. విజయ సాధించిన ఇద్దరు పీడీఎఫ్ ఎమ్మెలీలను పలువురు అభినందించారు. 
పీడీఎఫ్‌ అభ్యర్థులు విజయఢంకా 
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిసివున్న తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి విఠపు బాలసుబ్రహ్మణ్యం గెలుపొందారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు కలిసివున్న పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి కత్తి నర్సింహారెడ్డి విజయం సాధించారు. 
బాలసుబ్రహ్మణ్యం గెలుపు 
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి విఠపు బాలసుబ్రహ్మణ్యం వరుసగా మూడవసారి గెలుపొందారు. టీడీపీ బలపరిచిన వాసుదేవనాయుడుపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. బాలసుబ్రహ్మణ్యంకు 3,545 ఓట్లు ఆధిక్యతంలో గెలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 17,652 ఓట్లు పోలయ్యాయి. 537 ఓట్లు చెల్లలేదు. ఉపాధ్యాయులు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విఠపు బాలసుబ్రహ్మణ్యం చెబుతున్నారు. 
కత్తి నర్సింహారెడ్డి గెలుపు
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులురెడ్డిపై 3,759 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. నియోజకవర్గంలో మొత్తం 18,840 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 9,620 ఓట్లు నర్సింహారెడ్డికి వచ్చాయి. 513 ఓట్లు చెల్లలేదు. 26 నోటా ఓట్లు నమోదయ్యాయి.   టీడీపీ బలపరిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య  3,812 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  విజయానికి కృషి చేసిన నేతలకు కత్తి నర్సింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను నుంచి విజయం సాధించిన పీడీఎఫ్‌ అభ్యర్థులను పలువురు నేతలు, ఉపాధ్యాయులు అభినందించారు.

 

Don't Miss