సిరిమాను జాతర మహోత్సవాలకు అంకురార్పణ...

07:42 - September 30, 2018

విజయనగరం : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం  ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు యంత్రాంగం సమాయాత్తమవుతోంది. సిరిమాను జాతర మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. నెల రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు పందిరి రాట ఉత్సవంతో ప్రారంభమయ్యాయి. విజయనగరం పట్టణంలో మూడు లాంతర్ల జంక్షన్‌లో ఉన్న అమ్మవారి చదురుగుడి, రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న వనం గుడి దగ్గర పందిరి రాటలను వేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి దీక్షాదారులు, భక్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. 

అక్టోబర్‌ 22, 23 తేదీల్లో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు  సిద్ధమవుతున్నారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సుజయ కృష్ణ రంగారావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మంచినీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ద్యంతోపాటు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పైడితల్లి అమ్మవారి జాతరతోపాటు విజయనగరం ఉత్సవ్‌ను కూడా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అమ్మవారి సిరిమాను సంబరానికి రెండు రోజుల ముందు నుంచీ ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. విజయనగరం చరిత్రకు అద్దంపట్టేలా సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Don't Miss