వనపర్తిలో గులాబీ బహిరంగసభ....

16:01 - October 5, 2018

వనపర్తి : తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్..మరలా పాత వాడీవేడిని చూపిస్తున్నారు. మాటలు..చేతలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట. తనదైన యాసలో మాటల తూటాలు పేల్చే కేసీఆర్ ప్రసంగాలను చాలామంది ఆసక్తిగా వింటుంటారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలపై ఘాటైన మాటల దాడి చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు హడావుడి నెలకొంది. ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళం ఎన్నికల ప్రచారంలో దూసుకపోతోంది. గులాబీ బాస్ ఆశీర్వాద్ పేరిట సభలు నిర్వహిస్తూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. విపక్షాలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. పలు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభలు నిర్వహిస్తోంది. వనపర్తిలో కాసేపట్లో ఆశీర్వాద్ బహిరంగసభ నిర్వహిస్తోంది. హుస్నాబాద్, నిజామాబాద్, నల్గొండ సభల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న నాలుగో ఎన్నికల ప్రచార సభ ఇది. గత సభల్లో విపక్షాలను ఎండగట్టిన కేసీఆర్ ఎలాంటి మాటలు పేలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మందిని సభకు తరలించేలా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 60 ఎకరాల విస్తీర్ణంలో సభాప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.

Don't Miss