ప్రకృతి ప్రేమికులకు పిలుస్తున్న వరంగల్‌ టూరిజం

18:58 - June 8, 2018

వరంగల్ : ప్రకృతి అందాలు చూస్తూ వాటి మధ్య సేదతీరాలనుకుంటున్నారా? అడవుల్లో రాత్రిళ్లు విడిది చేయాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి ఆలోచనలు మీకు ఉంటే వరంగల్‌ వెళ్లాల్సిందే. అక్కడి ఇనుపరాతి గుట్టల్లో ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్‌, నైట్‌ క్యాంపింగ్‌ సౌకర్యాలను చూడాల్సిందే. రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికాభివృద్ధి.. తరిగిపోతున్న అటవీ సంపద.. పెరుగుతున్న కలుషిత వాతవరణం... ఇలాంటి పరిస్థితుల్లో కాస్త సమయం దొరికితే చాలు అడవుల్లో వాలిపోతారు ప్రకృతి ప్రేమికులు. ఇలాంటి వారికోసం మరిన్ని సౌకర్యాలతో స్వాగతం పలుకుతున్నాయి వరంగల్‌ ఫారెస్ట్‌, టూరిజం శాఖలు. ధర్మసాగర్‌ మండలం దేవునూర్‌లోని ఇనుపరాతి గుట్టల్లో ట్రెక్కింగ్‌, నైట్‌ క్యాంపింగ్‌ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాయి. 

కొద్దిరోజులుగా ఫారెస్ట్‌ టూరిజంపై దృష్టిపెట్టిన వరంగల్‌ టూరిజం డిపార్ట్‌మెంట్‌.. నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఇనుపతిరాతి గుట్టల్లోని అడవులను గుర్తించింది. వీటిపై మొదట ట్రెక్కింగ్‌ను తరుచుగా నిర్వహించారు. నగరవాసులు భారీగా తరలి వస్తుండటంతో మరిన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగా నైట్‌ క్యాంపింగ్‌ ఏర్పాటు చేశారు. నైట్‌ క్యాంపింగ్ ద్వారా సందర్శకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేందుకు ఈ సౌకర్యాన్ని కల్పించారు.  రాత్రిళ్లు అడవుల్లో నిద్రించేందుకు ప్రత్యేకమైన టెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి వర్షాన్ని, చలిని తట్టుకునేలా రూపొందించారు అధికారులు. రాత్రి సమయంలో క్యాంప్‌ ఫైర్‌ ఎంజాయ్‌ చేసిన తర్వాత సందర్శకులు నిద్రపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సౌకర్యాలను పొందడానికి వెయ్యి రూపాయలను టికెట్‌ ధరగా నిర్ణయించారు. 

ప్రస్తుతం వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిందన్నారు కలెక్టర్‌ ఆమ్రాపాలి. అడవుల సంరక్షణను బాధ్యతగా భావించి.. ఇనుపరాతి గుట్టల్లో ఏకో టూరిజం డెవలప్‌ చేశామన్నారు. ఇందులో భాగంగా ట్రెక్కింగ్‌, నైట్ క్యాంపింగ్‌,  క్యాంప్‌ ఫైర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సౌకర్యాలను ఎంజాయ్‌ చేయాలనుకుంటే నేరుగానే కాకుండా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఆన్‌లైన్‌ పే ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చని ఆమ్రాపాలి అన్నారు. 

వివిధ శాఖల అధికారులు ఉత్సాహంగా ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు. క్యాప్‌ ఫైర్‌లో విద్యార్థుల నృత్యాలు చూపరులను ఆకట్టకున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడ లేని సౌకర్యాలను వరంగల్‌ నగరంలో కల్పించటంతో నగర్‌ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా.. ఇలాంటి సౌకర్యాలను  మీరు ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఇనుపరాతి గుట్టలు మీ కోసం స్వాగతం పలుకుతున్నాయి. 

Don't Miss