60వ వసంతంలోకి నిట్‌ ..

09:51 - October 8, 2018

వరంగల్ : నూతన ఆవిష్కరణలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన వరంగల్‌ నిట్‌.. జాతికి ఎందరో మేథావులను అందించింది.  భారత తొలి ప్రధాని చేతుల మీదుగా అంకురం తొడిగిన నిట్‌...  భరత మాత సిగలో సృజనాత్మక కిరీటంగా బాసిల్లుతోంది. అరవై వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సరస్వతీ నిలయంలో ఇవాళ వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ ఉత్సవాలు ప్రారంభించేందుకు  సర్వం సిద్ధం చేశారు.

దేశంలోనే అరుదైన విశిష్టతతో, తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ.  భారత తొలి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా   1959, అక్టోబర్ 10న  250 ఎకరాల  విస్తీర్ణంలో వరంగల్‌ నిట్‌కు అంకురార్పణ జరిగింది.  నాటి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది.. ఓరుగల్లు సిగలో కిరీటంలా మారింది.  ఇప్పుడు 60వ వసంతంలోకి అడుగుపెడుతోన్న నిట్‌  వజ్రోత్సవాలను కోలాహలంగా నిర్వహించనున్నారు. ఇవాళ ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. 

25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అలుమిని కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 10న దేశంలోని ప్రముఖులతో కలిపి వర్క్ షాప్ నిర్వహించనున్నారు. భారతీయ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పద్మభూషణ్ విశ్వమోహన్ వీణ, పద్మభూషణ్ విద్వాన్ వినాయక్రమ్, రమా వైద్యనాథన్, మంజూషా, గురచరణ్ సంగీత కచేరిలకు రూపకల్పన చేశారు.
నిట్‌లో ఆసియా, మధ్య ఆసియా ఆఫ్రికా దేశాల విద్యార్థులు

వరంగల్‌ నిట్‌లో ఆసియా, మధ్య ఆసియా, ఆఫ్రికా వంటి 40 దేశాల విద్యార్థులు చదువుకుంటున్నారు. 8 యూజీ, 25 ఎంటెక్, 4 ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్స్, పీజీ స్థాయిలో 32 కోర్సులు కలిగి ఉన్న నిట్‌గా వరంగల్ రికార్డు సృష్టించింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఉన్న ఏకైక సంస్థ ఇదే.  అత్యాధునిక పరికరాలతో పరిశోధనలను, ఇంటర్స్ షిప్‌కు అవకాశం కల్పిస్తున్నారు. 

ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. ఆర్మీ అధికారులతోపాటు.. వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్,  జిల్లా పోలీస్ అధికారులు హెలిప్యాడ్ ను పరిశీలించారు. ఆర్మీ హెలికాప్టర్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించింది.  ఆర్ట్స్ కళాశాల హెలీప్యాడ్ నుంచి నేరుగా నిట్ లో నూతనంగా ప్రారంభించిన అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌కు ఉప రాష్టపతి చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

నూతన ఆవిష్కరణలకు చిరునామాగా నిలిచిన వరంగల్ నిట్‌.. జాతి ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తోంది. ఈ వజ్రోత్సవాల స్పూర్తితో నిట్ యాజమాన్యం, విద్యార్ధుల్లో మరింత ఉత్సాహం తొణికిసలాడుతోంది. సమాజ కాంక్షతో వారంతా.. ముందుకు సాగుతున్నారు. 
తెలంగాణ, వరంగల్, నిట్, సిల్వర్ జూబ్లీ వేడుకలు, ఉప రాష్ట్రపతి, వెంకయ్యనాయుడు, ఆర్ట్స్ కళాశాల హెలీప్యాడ్ ,

Don't Miss