కాలుష్యపు కోరల్లో మెతుకు సీమ

21:38 - April 17, 2018

మెదక్ : మెతుకుసీమ.. కాలుష్యపు కోరలకు చిక్కి విలవిలలాడుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలే. నీరు, గాలి, మట్టి.. ఇలా అంతటా కాలుష్యమే. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో కాలుష్యకారక పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాలుష్యంతో తల్లడిల్లిపోతున్న స్థానికులు.. కొత్తపరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. 

పారిశ్రామికంగా ఎదుగుతున్న సంగారెడ్డి జిల్లాలో.. అంతే స్థాయిలో కాలుష్యమూ విస్తరిస్తోంది. ఇప్పుడున్న వాటికి తోడు.. మరో కాలుష్యకారక పరిశ్రమ ఈ ప్రాంతానికి రాబోతోంది. ప్రజల అభీష్టంతో నిమిత్తం లేకుండానే ఈ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం యావాపూర్‌, మద్దికుంట సమీపంలో కొత్తగా ఓ ఫార్మా కంపెనీని స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు పదిహేడు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యంతో ఈ ఫార్మా కంపెనీని స్థాపిస్తున్నారు. ఇప్పటికే పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్యాల బారిన పడుతున్న ప్రజలు.. కొత్త ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. నిజానికి మార్చి 28న ఈ కంపెనీపై ప్రజాభిప్రాయ సేకరణకు సభ నిర్వహించాలని ప్రయత్నించారు. కారణాలేమో కానీ.. ఈ సభ రద్దయింది. మళ్లీ జనాభిప్రాయ సేకరణ సభ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియదు కానీ.. ఆ ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటిస్తామని స్థానికులు చెబుతున్నారు. 

యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌ పేరిట ప్రారంభించబోతున్న పరిశ్రమకు వ్యతిరేకంగా ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవలే జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ దీనిపై వాడివేడిగా చర్చ జరిగింది.. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా.. పరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ  స్థానిక ఎమ్మెల్సీ పోతూరి సుధాకర్‌ రెడ్డి కూడా అధికారులను జెడ్పీ సమావేశంలో గట్టిగా నిలదీశారు. 

సదాశివపేటలో.. 112 ఎకరాల్లో నెలకొల్పే ఈ పరిశ్రమలో 16 రకాల ఉత్పత్తులు బయటికొస్తాయి. వీటికోసం రోజుకు 863 లీటర్ల నీరు అవసరం అవుతుందని... సుమారు 1500 మందికి ఉపాధి లభించవచ్చని ప్రభుత్వం చెప్పుకొస్తోంది.  పరిశ్రమ వల్ల కలిగే లాభాలనే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. ఐతే పరిశ్రమల వల్ల వ్యాపించే కాలుష్యం గురించి ప్రభుత్వం కానీ,  అధికారులు కానీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.     బైట్ : 
నిజానికి ఈ ప్రాంతంలోని ఫార్మా కంపెనీలన్నింటినీ జనావాసాలకు దూరంగా ఒకే చోటికి తరలిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అయితే.. ఇప్పుడు మాట తప్పి.. కొత్తగా మరో ఫార్మా కంపెనీకి అనుమతినివ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. స్థానికుల అభిప్రాయాన్ని సేకరించి.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానిక కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. 

పరిశ్రమలు రావాలి.. ఉపాధి లభించాలి.. అయితే ఆ వంకతో ప్రజారోగ్యంతో చెలగాటమాడతామంటే మాత్రం సహించేది లేదని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం.. జనాభిప్రాయ సేకరణను మొక్కుబడి తంతుగా నిర్వహించి చేతులు దులిపేసుకుంటే రోడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నెలకొల్పబోయే యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌కు గడ్డుపరిస్థితే కనిపిస్తోంది. 

Don't Miss