తెలంగాణ అమర్ నాథ్ క్షేత్రం.. సలేశ్వరం

18:51 - April 1, 2018

నాగర్ కర్నూలు : భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రం.. ప్రకృతి ప్రేమికులకు పర్యాటక క్షేత్రం... ఉడుకు రక్తం ఉప్పొంగే యువతకు సాహస క్షేత్రం... ఔను.. అక్షరాల ఇది నిజమే.. ఈ భావనలన్నీ కలగలిసి... అచ్చం అమర్‌నాథ్‌ యాత్రను తలపిస్తుంది ఈ క్షేత్రం. తెలంగాణ అమర్ నాథ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం యాత్రపై టెన్‌ టీవీ  ప్రత్యేక కథనం.
సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర సలేశ్వరం
చుట్టూ విశాలమైన అడవి.. ఎత్తైన చెట్లు.. ప్రకృతి  అందాలు... పక్షుల కిలకిల రావాలు... పాముల పుట్టలు... వన్యప్రాణులు.. ఇవన్నీ దట్టమైన నల్లమల అడవిలో వెలసిన సలేశ్వరం క్షేత్రపు వాతవరణం. సాక్షాత్తూ శివుడే కైలాసాన్ని మరిచి  ఇక్కడే కొలువయ్యాడేమో అన్న భావన కలుగుతుంది ఈ క్షేత్రాన్ని దర్శిస్తే.. ఇక్కడి రాయి, రప్ప, చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతతో పెనవేసుకుని ఉంటాయి.  
లోతైన లోయలో కొలువుదీరిన లింగమయ్య
లోతైన లోయలో కొలువుదీరిన లింగమయ్యను చేరుకోవాలంటే.. కాలినడకన ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..  కొండలూ, గుట్టలూ,, రాళ్ళూ రప్పలూ దాటుకుంటూ కాలినడకన అక్కడికి చేరుకోవడం ఓ సాహస యాత్రే...  గోరంత కష్టానికి తట్టుకుని దట్టమైన అడవిలో.. లోతైన లోయలోకి చేరుకుంటే... వెలకట్టలేని అపూర్వ అనుభూతిని తనివి తీరా ఆస్వాదిస్తారు.భక్తులు సలేశ్వరంగా పిలుచుకునే సర్వేశ్వర క్షేత్రం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవిలో వెలసింది. అమ్రాబాద్ మండలం మన్ననూరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో.. దట్టమైన అడవిలోని ఒక లోతైన లోయలో ఉంది ఈ సలేశ్వరం..
ఈనెల 5న ఉత్సవాల ముగింపు
గత నెల 29న ప్రారంభమైన ఇక్కడి ఉత్సవాలు ఈనెల 5న ముగియనున్నాయి. ఈ అడవిలో వేలాది మంది భక్తులు లోయలోకి దిగి స్నానాలు ఆచరించి.. స్వామిని దర్శించుకుంటారు. శివాలయం ఎదురుగా దాదాపు వంద అడుగుల ఎత్తు రాతికొండ నుంచి పరవళ్ళు తొక్కే జలపాతం చూపరులను కట్టిపడేస్తుంది.  ఒక్క మనిషి మాత్రమే నడిచేంత బాటతో కూడిన లోయ అడుగుభాగానికి చేరుకోవడమంటే సాహసమే.. అంతకష్టమైనా వయసుతో ప్రమేయంలేకుండా ప్రతీ ఒక్కరూ జంగమయ్య సేవలో తరించిపోతారు.  ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి కూడా భక్తులు వస్తారు.  
నైవేద్యంగా ఇప్పపువ్వు, సారాయి 
గుడిలోని శంఖుతీర్థంలో స్నానం చేయడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. గుండం జలాన్ని సర్వరోగనివారిణిగా నమ్ముతారు. లింగమయ్యస్వామికి, గంగమ్మకు భక్తులు వెండి వస్తువులతో మొక్కులు చెల్లించుకుంటారు. నాగదోశం ఉన్నవారు వెండి నాగును ఇస్తారు.. చెంచులు కొత్తగా పూసిన ఇప్పపువ్వు, సారాయి నైవేద్యంగా పెడతారు.  

 

Don't Miss