యథేచ్చగా చేపల చెరువుల అక్రమ తవ్వకం

08:25 - April 8, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో చేపల చెరువుల అక్రమ తవ్వకం యథేచ్చగా కొనసాగుతోంది. వందల ఎకరాల్లో చెరువులను తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులను తవ్వడంతోపాటు.. మట్టిని సైతం అమ్మేసుకుంటున్నారు.  కాళ్ల మండలంలో జోరుగా సాగుతున్న చేపల చెరువుల అక్రమ తవ్వకాలపై 10టీవీ ప్రత్యేక కథనం...
పచ్చని పంటపొలాలు కనుమరుగు
పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది ధనార్జనకు పచ్చని పంటపొలాలు కనుమరుగవుతున్నాయి. చేపల చెరువుల పేరుతో  పంట పొలాలను యధేచ్చగా తవ్వేస్తున్నారు. ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు పండుతున్న వరి పొలాలన్నీ ఇప్పుడు చేపల చెరువులుగా మారిపోతున్నాయి. 
పచ్చని పంట పొలాలు ధ్వంసం
కాళ్ల మండలంలో ఇప్పుడు ఎక్కడ చూసినా చేపల చెరువులు తప్ప పంటపొలాలు కనిపించడం లేదు. కాళ్లలంకలో కొంతమంది ధనార్జన కోసం పచ్చని పంటపొలాలను ధ్వంసం చేస్తున్నారు. వాటిని చేపల చెరువులుగా మార్చివేస్తున్నారు. పోనీ అవన్నా నిబంధనల ప్కారం జరుగుతున్నాయా అంటే అదీలేదు.  అక్రమంగా చేపల చెరువులను తవ్వేస్తున్నారు. వందల ఎకరాల్లో ఈ తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి.
200 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకం
కాళ్లలంకలో దాదాపు 200 ఎకరాల్లో చేపల చెరువులు అక్రమంగా తవ్వుతున్నారు. మీరు చూస్తున్న ఈ చెరువు.. భీమవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు గ్రంథి శ్రీనివాస్‌కు చెందినదిగా స్థానికులు చెపతున్నారు. ఇక్కడ తవ్వకాలను ఎలాంటి అనుమతులు లేవు.  చెరువులు తవ్వడానికి రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్‌, మైనింగ్‌, పొల్యూషన్‌తోపాటు 11శాఖలు అనుమతులు ఇవ్వాలి. మరి ఎవరి అనుమతి తీసుకోకుండానే యథేచ్చగా చెరువులు తవ్వేస్తున్నారు. 
మట్టిని తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్న అక్రమార్కులు
చెరువుల కోసం తవ్విన మట్టిని  అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.  లారీలు, ట్రాక్టర్లలో ఈ మట్టిని తరలిస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు పగలు - రాత్రి అన్న తేడాలేకుండా మట్టిని తరలిస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీలు నడిపే వారిలో సగానికిపైగా డ్రైవర్లు మైనర్లే ఉన్నారు. వారికి ఎలాంటి లైసెన్స్‌లు లేవు.  వేగంగా డ్రైవింగ్‌ చేస్తూ రోడ్లపై ఎదురొచ్చిన జంతువులపై వాహనాలు ఎక్కిస్తున్నారు. ఇప్పటికే చాలా కోళ్లు, కుక్కలు  చనిపోయాయి. 
రెండు నెలలుగా మట్టి తరలింపు
రెండు నెలలుగా మట్టి తరలింపు జరుగుతోంది. వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు పగలు - రాత్రి తిరుగుతుండడంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. అంతేకాదు. వాహనాలు గ్యాప్‌ లేకుండా తిరుగుతుండడంతో దుమ్ము, ధూళి లేవడంతో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. వాహనాల శబ్దానికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
అధికారులకు అందుతున్న ముడుపులు!
ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు. అధికారులకు ఇదంతా తెలిసే జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముడుపులు పుచ్చుకుని మిన్నకుండిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమంగా సాగుతున్న చెరువుల దందాపై కలెక్టర్‌ దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కాళ్లలంక గ్రామస్తులు కోరుతున్నారు.

 

Don't Miss