ఈ భూమికేమైంది?!!..

16:19 - May 3, 2018

ఢిల్లీ : భూగోళంలో ఎన్నో వింతలు? విచిత్రాలు, అద్భుతాలు,ఆశ్చర్యాలు. ప్రకృతి వింతలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ప్రకృతి ప్రళయాన్ని, ప్రకోపాన్ని ఊహించేందుకు మనిషి మేధస్సు చాలదు. ఒకచోట చల్లగా, మరోచోట వెచ్చగా, ఇంకోచోట సమతుల్యంగా, ఒక ప్రాంతోని భూమి సస్యశ్యామలంగా, మరోప్రాంతంలో క్షామంగా. ఒకచోట అందంగా..మరోచోట భయకరంగా ఇలా ప్రకృతిలో వింతలు, విచిత్రాలు. ఈ భూమిపై మనిషి ఊహకు..మేధస్సుకు అందనంత అగమ్యగోచరంగా...అయోమంగా వినిపిస్తుంటాయి. కనిపిస్తుంటాయి. ప్రకృతి మనిషికి ఎప్పుడు సవాల్ విసురుతునే వుంటుంది. దాన్ని ఛేదించేందుకు మనిషి యత్నిస్తునే వుంటాడు. ఈ క్రమంలో బహు మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఇప్పుడు మనకు అందిన సమచారం మేరకు ప్రస్తుతం భారతదేశంలో అదే జరుగుతోంది.

ఒకచోట ఎండలు..మరోచోట వానలు..
మొన్నటి వరకూ ఎండలు మనిషి మాడ్చి పడేశాయి. గచ్చుమీద ఆమ్లెట్ వేసుకుని తినేసేంతగా కాల్చుకుతినేశాయి. మండించేసాయి. ఒకే రోజు ఒకచోట వేడి గాలులు...ఇంకోచోట వడగళ్ల వర్షాలు...ఇంకోచోట ఇసుక తుపానులు.. ఎందుకిలా? ఏమిటా కారణం? అసలు వేసవిలో ఎండలెందుకు పెరుగుతాయో? రోజురోజుకీ మారుతున్న ఉష్ణోగ్రతల్లో తేడాలెందుకో? తెలుసుకుందామా?

ప్రాణి మనుగడకు మూడు కాలాలు..
మనకు కాలాలు మూడు అనే విషయం తెలిసిందే. వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం. ఈ మూడు కాలాలు ప్రాణి మనుగడకు దోహదపడుతుంటాయి. వేసవి ఎండలకు నీరు ఆవిరైపోతుంది. వర్షాకాలం అదే నీరు వర్షంగా మారి ప్రాణికోటికి అవసరమైన స్వచ్ఛమైన వాననీటిని అందిస్తుంది. ఆ వర్షమే ప్రాణికోటికి జీవాధారమవుతుంది. ఇక శీతాకాలం..చలి ఎక్కువగా వుంటంతో గాలిలోని తేమ మంచుగా మరిపోయి ఆయా కాలంలో వచ్చే పంటలకు ఉపయోగపడుతుంది. ఈ మూడు కాలాలు ప్రాణికోటి మనుగడు కారణాలుగా మారి కాపాడుతుంటాయి. కానీ అన్ని జంతువులలోకి తెలివిగల మనిషి మాత్రం తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. మనిషి జీవితంలోపెను మార్పులకు కారణమైన అనేకనేక కారణాలు ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఇత్యాది కారణాలన్నీ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి అకాల వాతావరణ కారకాలుగా మారి కాలాల గమనంలో పెను మార్పులకు తావిస్తున్నాయి. దీంతో ఎండకాలంలో వర్షాలు, శీతాకాంలో ఎండలు..వానాకాలంలో వర్షాలు లేక కరవు కాటకాలకు కారణభూతాలుగా మారిపోతున్నాయి.

వేసవికాలం దినచర్యల్లో మార్పులు..
వేసవికాలం వచ్చిందంటే చాలు మన దినచర్యల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. మధ్యహ్నాం చేసుకునే పనులు ఉదయాన్నో..లేదా సాయంత్రం చల్లబడిన తరువాతకో పనులను వాయిదా వేసుకుంటుంటాము. తినే ఆహారంలో మార్పులు చేర్పులు చేసేసుకుంటాం. స్కూల్స్ కు సెలవులిచ్చేస్తారు. వేసవి సెలవులు రాగానే చాలామంది చల్లటి ప్రదేశాలకు టూర్స్ వేసేసుకుంటారు. చల్ల చల్లటి వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటాము. ప్రయత్నిస్తుంటాము. ఎందుకంటే ఇప్పటికే మీకు అర్ధం అయిపోయి వుంటుంది. ఈ కాలంలోనే వేడి ఎక్కువ ఎందుకని? భూమి తన చుట్టూ తాను తిరిగే అక్షం కొంచెం వంగడం వల్లే. అంటే భూమి సూర్యుడికేసి కొంచెం వంగుతుందన్నమాట. ఇప్పుడు వంగిన వైపు మన దేశం ఉంది కాబట్టి మనకు ఎండలు కాసే ఎండాకాలం వస్తుంది.

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..
పల్లెటూళ్లలో చల్లగా ఉంటుంది. అదే నగరాల్లో ఎక్కువ వేడిగా వుంటుంది. ప్రాంతాల్ని బట్టి ఎండ వేడి వేరువేరుగా ఉంటుంది. నగరాల్లో భవనాలు, ఉపయోగించే యంత్రాలు బోలెడంత వేడిని పుట్టిస్తాయి. భవనాలు, ఎత్తయిన నిర్మాణాలు ఎక్కువగా వేడిని స్టాక్ చేసేస్తాయట. అందుకే మొక్కలు తక్కువగా, భవనాలు ఎక్కువగా ఉంటే వేడి ఎక్కువవుతుందన్నమాట. కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఎక్కువగా ఉన్నా... స్థానిక పరిస్థితులు, భవనాలు, జీవనవిధానం వంటి కారణాల వల్ల కూడా వేడి ఎక్కువగా ఉంటుంది.

వేసవిలో వర్షాలేందుకొస్తాయి?!..
ఇటీవల ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు బాగా పడుతున్నాయి. వేసవిలో అసలీ వర్షాలు కురవడం ఏంటంటే....?ఎండ ఎక్కువగా ఉండటం వల్ల భూమి వేడెక్కుతుంది. దానికి దగ్గరగా ఉన్న గాలి మిగిలిన గాలి కన్నా ఎక్కువగా వేడెక్కుతుంది. ఇలా గాలి వేడిగా తయారుకావడంతో అది తేలికై వాతావరణంలో పైకి వెళుతుంది. ఇలా భూమి సమీపంలోని గాలి వాతావరణంలో పైపైకి వెళ్లిపోవడంతో గాలి తక్కువై పోతుందన్నమాట. పైకి వెళుతున్న గాలి వ్యాకోచం చెంది చల్లబడుతుంది. నీటి ఆవిరి... తేమతో కూడిన గాలి ఈ విధంగా చల్లబడటంతో ఒక దశలో అది ద్రవీభవన స్థాయిని చేరుకుంటుంది. అంటే గాలిలోని తేమ చల్లదనానికి నీటి బిందువులుగా మారిపోతాయన్నమాట.దీనివల్ల మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు పెరుగుతూ ఓ దశలో వర్షంగా కురుస్తాయి. ఇలా వేసవిలో కురిసే వర్షాల్ని ‘సంవహన వర్షాలు’ అంటారు. భూమిపై అన్ని చోట్ల ఉండే వాతావరణ పరిస్థితుల ఫలితమేఈ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటాయన్న మాట..ఈ ప్రక్రియలో స్థానికంగా క్షణక్షణం మారుతూ ఉంటుందన్నమాట.

Don't Miss