వాకపల్లి మహిళల న్యాయ పోరాటం

20:29 - September 12, 2017

 విశాఖ : కట్టుకున్నవాళ్లు వదిలేశారు...! అయినవాళ్లు.. తరిమికొట్టారు...! గ్రామ పెద్దలు శిక్షించారు..! న్యాయం కోసం అడిగితే... పరీక్షలు చేశారు... ప్రశ్నలతో వేధించారు..! పోలీసుల దాష్టీకానికి బలై... ఎన్నో అవమానాలకు గురయ్యారు వాకపల్లి ఆదివాసీ మహిళలు.. అందులో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు... ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత సుప్రీం కోర్టు స్పందించింది.. జరిగిన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ఇన్నేళ్లు వాళ్లు పడ్డ అవస్థలపై... సమాధానం చెప్పాల్సిందెవరూ... ప్రభుత్వమా..? దాన్ని ఎన్నుకున్న సమాజమా..? న్యాయం కోసం సమాజంతో... ప్రభుత్వంతో పోరాడుతున్న వాకపల్లి మహిళల ఆవేదనపై ప్రత్యేక కథనం.. 
వాకపల్లి అత్యాచార ఘటనపై స్పందించిన సుప్రీం 
సుప్రీం తీర్పుతో తెరపైకి వచ్చిన వాకపల్లి మహిళల ఘటన... సమాజం ముందు ఎన్నో ప్రశ్నలు ఉంచింది. చట్టాల్లోని లోపాలను.. సమాజంలో ఉన్న రుగ్మతలను ఎత్తి చూపింది. 2007లో ఆదివాసీ పీటీజీ తెగకు చెందిన గిరిజన యువతులపై గ్రేహౌండ్స్ పోలీసులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. విశాఖ ఏజెన్సీలోని.. జి. మాడుగులలోని నుర్మతి పంచాయతీలోని వాకపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులను గాలిస్తూ...ఆ గ్రామానికి చేరుకున్న 21 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు 11 మంది ఆదివాసీ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.
సామాజికంగా అవమానాలు
జరిగింది అత్యాచారం.. బాధితులు అమాయక గిరిజనులు..! వారిని బలాత్కరించిన వారికి శిక్ష పడాలి. కానీ.. విచిత్రంగా సమాజం, బాధిత మహిళలనే.. దండించింది. దుర్మార్గులపై దండెత్తాల్సిన భర్తలు.. తమ భార్యలనే వదిలేశారు. అయితే కాలక్రమంలో.. కొందరు భర్తలు మారి.. తమ భార్యలను చేరదీశారు. మరికొందరేమో అదే మూర్ఖత్వంతో.. భార్యలను చేరనీయలేదు.
కృంగిపోయేలా చేసిన కుల కట్టుబాట్లు 
ఇక కుల కట్టుబాట్లయితే.. మహిళల నవనాడులూ కృంగిపోయేలా చేశాయి. అత్యాచారం చేయించుకు వచ్చినందుకు గాను.. పరిహారం చెల్లించాకే గ్రామంలో అడుగు పెట్టాలంటూ కుల పెద్దలు.. పంచాయతీ పెద్దలు ఆంక్షలు విధించారు. ఇలా అడుగడుగునా.. అత్యాచార బాధితులకు న్యాయం జరగకపోగా... సామాజికంగా కూడా వారు చిత్రవధకు గురయ్యారు. వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి.
అన్యాయంపై ఎమ్మెల్యేకు తెలిపిన బాధితులు
కులం కట్టుబాట్లు.. సమాజం వంకర చూపులు.. గ్రామస్థుల అవహేళనలు.. ఇలా బాధితులు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు మొరపెట్టుకోని వారు లేరు. చివరికి వీరి గోడు ఫలించి, పోలీసులు, ఐపీసీ సెక్షన్ 372(2), సెక్షన్ 3 (2), ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం కింద గ్రేహౌండ్స్‌ పోలీసులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. అప్పటి ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. అయితే సీఐడీ తన విచారణలో వాకపల్లి ఆదివాసీ మహిళలపై అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్లు లేవని తెలిపింది. ఆనాటి నుంచి వాకపల్లి మహిళలు తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఈ పది సంవత్సరాల్లో న్యాయం అందకుండానే.. దోషులకు పడే దండన చూడకుండానే.. ఇద్దరు బాధిత మహిళలు చనిపోయారు.
కేసు నుంచి బయటపడేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు 
మరోపక్క ఈ కేసు నుంచి బయటపడడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు 2008 హైకోర్టులో తమపై జరుగుతున్న విచారణను ఎత్తివేయాలంటూ క్వాష్‌ పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు 2012లో కోర్టు 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులలో 13 మందిని విచారణ నుంచి మినహాయింపు ఇచ్చింది. మిగిలిన ఎనిమిది మంది మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా... వారు వేసిన పిటిషన్‌ 2017 సెప్టెంబర్ ఒకటో తేదీన విచారణకు వచ్చింది. ఈ మేరకు  జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ శాంతానా గౌండర్‌లతో కూడిన ధర్మాసనం పోలీసుల పిటిషన్‌ను కొట్టి వేసింది. ఈ కేసులో అపరిమిత  జాప్యం జరిగినందుకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.. నిందితులైన 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులపై కేసు విచారణ జరిపి తీరాలని ఆదేశించింది. ఆరునెలలలోపు విచారణను పూర్తి చేసి సత్వరం న్యాయం చేకూర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ సంచలన తీర్పుప గిరిజన , ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
బాధితులకు న్యాయం జరిగినట్టేనా? 
అయితే...ఒకవేళ విచారణ ముగిసి...నిందితులకు శిక్ష పడినా... బాధితులకు న్యాయం జరిగినట్టేనా? ఈ పదేళ్ల కాలంలో వారు ఎదుర్కొన్న మానసిక, శారీరక చిత్రవధకు ఉపశమనం లభిస్తుందా..? ఇన్నేళ్లలో వీరు పడ్డ వెతలకు పరిష్కారం.. సాంత్వన.. ఎలా?? ఇదీ ఇప్పుడు సమాజం ఆలోచించాల్సిన కోణం. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సిన అంశం.  

 

Don't Miss