ప్రశ్నిస్తే చంపేస్తారా...?

20:32 - September 6, 2017

ఏం ప్రశ్నిస్తే చంపేస్తారా? ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోందా? లేక నియంతృత్వం ఉందా?మతాన్ని ఆధారంగా చేసుకున్న కుటిల రాజకీయాలను ఎండగడితే తప్పా? మూఢనమ్మకాలను, మూర్ఖ విశ్వాసాలను తప్పుపడితే పాపమా?హక్కుల కోసం నినదించటమే, లౌకిక సమాజంకోసం కలలుకనటమే నేరమా? ఆ తూటాలు పేల్చిన చేతులెవరివి? ఆ చేతలను పురికొల్పిన ఆలోచనలెవరివి? కల్బుర్గి, గోవింద్ పన్సారే, నరేంద్ర ధబోల్కర్, గౌరి లంకేశ్...ఈ వరుసలో ఎందరు? ఈ దేశంలో హేతువాదులకు, ఉద్యమకారులకు, పాత్రికేయులకు రక్షణ లేదా? నిజాల నిగ్గు తేల్చే జర్నలిస్టుల ప్రాణాలకు గ్యారంటీ లేదా? గౌరి హత్య ఏ సంకేతాలిస్తోంది..

గౌరీ లంకేశ్..ప్రఖ్యాత జర్నలిస్ట్ లంకేశ్ వారసురాలు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంతో అనుభవం ఉన్న ధైర్యశాలి. నమ్మిన విలువల కోసం.. మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా, దళితులు, మహిళల హక్కుల కోసం నిరంతరం తపించిన గౌరి లంకేశ్ ని చంపిందెవరో ఊహించటం కష్టం కాదు.. ఎవరి తూటాలకు బలయ్యారో గ్రహించటం కష్టం కాదు.. కానీ, నిజం నిగ్గుతేలుతుందా అంటే.. గత అనుభవాల దృష్ట్యా అనుమానమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?ప్రభుత్వ విధానాల లోపాలను వేలెత్తితే వేధిస్తారా?రాజకీయ పార్టీల మతతత్వ కుట్రలను ప్రస్తావిస్తే జైల్లో పెడతారా?మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలో ఉన్నామా? ఈ దేశంలో ఏ శక్తులు రాజ్యమేలుతున్నాయి? ఆ తుపాకుల పట్టిన చేతులకు దన్నుగా నిలిచిందెవరు?


నిషేధాల కాలమంటూ పెన్నును వణికించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసహనంతో రగిలిపోతూ మీడియాపై దాడులకు దిగుతున్నారు. పరువు ప్రతిష్ట అంటూ నిజాలకు ముసుగులు తొడుగుతున్నారు. ప్రశ్నంచే గొంతుకలను నులిమేస్తున్నారు. ఇదేనా దేశంలో జరుగుతోంది? జరుగుతున్న పరిణామాలే సంకేతాలిస్తున్నాయి? కాల్చి చంపేస్తున్నారు. మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా ఒకరిని చంపేశారు. ఇంట్లోకెళ్లి మరొకరిని హత్య చేశారు. ఎంఎం కల్బుర్తి, గోవింద్ పన్సారే, నరేంద్ర ధబోల్కర్.. ఈ వరుసలో ఇప్పుడు గౌరీ లంకేశ్.. ఓవరాల్ గా దేశంలో కవులు, రచయితలు, స్వేఛ్చావాదులపై దాడులు పెరిగాయి. తూటాలు దిగుతున్నాయి. ప్రశ్న ప్రజాస్వామ్యం ఉందనటానికి ఓ బలమైన ఉదాహరణ. అలాంటి ప్రశ్నబతికి ఉన్నప్పుడే హేతువాదంపై అడుగులు పడతాయి. లౌకిక వాదాన్ని విశ్వసిస్తారు. మతతత్వాన్ని విస్మరిస్తారు. అందుకే... ప్రశ్నను ఆయుధంగా చేసుకున్న పాత్రికేయులు, రచయితలపై ఈ దాడులు. ప్రశ్న బతికినపుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

 

Don't Miss