మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఎక్కడ..?

12:47 - July 12, 2018

హైదరాబాద్ : మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఎక్కడ..? కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లుగా ఎందుకున్నారు..? ప్రాజెక్టులకు భూసేకరణపై.. కోర్టుల్లో కేసులు వేసి.. కేసీఆర్‌ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిర చేసిన దామోదర.. ఉన్నట్లుండి ఎందుకు సైలెంట్‌ అయ్యారు. ముఠా నాయకుడంటూ కేసీఆర్‌ తిట్టిపోసిన దామోదర మౌనం వెనుక మతలబేంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.
తెలంగాణ రోడ్‌మ్యాప్‌లో కీలక భూమిక
దామోదర రాజ నరసింహ..! మాజీ డిప్యూటీ సీఎం..! అంతేనా..? తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో.. కీలక రోడ్‌మ్యాప్‌లో అంతే కీలకంగా వ్యవహరించిన నేత. ఈక్రమంలోనే.. అధిష్ఠానం ముందు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి.. సోనియానే మెప్పించిన నేత. పైగా ఫైర్‌బ్రాండ్‌ ఇమేజ్‌తో.. కేసీఆర్‌ పేరెత్తినా.. ప్రత్యర్థులను ఏకిపారేయాలన్నా.. ఒంటికాలిపై లేచే నాయకుడు. ఇంతటి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న దామోదర రాజనరసింహ.. ఉన్నట్టుండి మౌనముద్ర దాల్చారు.
గతంలో ఎన్నడూ లేని మౌనముద్రలో దామోదర 
దామోదర రాజనరసింహ.. 2014 ఎన్నికల ఓటమి తర్వాత.. ఎన్నడూ లేనంతటి మౌనాన్ని ప్రస్తుతం పాటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. కనీసం గాంధీభవన్‌ వైపు కన్నెత్తయినా చూడడం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణలో.. ముఖ్యంగా మల్లన్నసాగర్‌ వ్యవహారంలో.. కేసీఆర్‌ సర్కారును కేసులతో ఉక్కిరి బిక్కిర చేసిన దామోదర.. కొంతకాలంగా సర్కారుపైనా విమర్శలు గుప్పించడం లేదు.
కేసీఆర్‌తో ముఠానాయకుడన్న ముద్ర వేయించుకున్న దామోదర
కేసీఆర్‌ సర్కారును కోర్టులతో మొట్టికాయలు వేయించి.. ప్రభుత్వాధినేతతో ముఠానాయకుడన్న ముద్రను వేయించుకున్న దామోదర రాజనరసింహ ఎందుకిలా మౌనంగా ఉన్నారు. ఈ ప్రశ్నకు.. పార్టీ అంతర్గత పరిణామాలే కారణమన్న సమాధానం వస్తోంది. కేసీఆర్‌ లాంటి నేత అవినీతిపై తాను పోరాడుతుంటే.. పార్టీ అధిష్ఠానం తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న భావనలో దామోదర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తాజాగా జరిగిన పదవుల పందేరమే దీనికి కారణమని చెబుతున్నారు. 
ఎమ్మెల్యే సంపత్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవి
ఈ మధ్యనే.. పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంపత్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవి దక్కింది. తనలాంటి సీనియర్‌ను కాదని, తన సామాజిక వర్గానికే చెందిన సంపత్‌కు ఢిల్లీ స్థాయి పదవి కట్టబెట్టడం, పైగా మహారాష్ట్రకు ఇంచార్జిగా కూడా నియమించడం దామోదర ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. ఈకారణంతోనే ఆయన మౌనముద్ర దాల్చారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు.. దానం నాగేందర్‌ బాటలో ముఖేశ్‌ కూడా కారెక్కుతారని, అధిష్ఠానంపై అలిగిన దామోదర కూడా గులాబీ గూటికి చేరవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
పార్టీ మార్పిడి వార్తలు తోసిపుచ్చుతున్న సన్నిహితులు
దామోదర రాజనరసింహ పార్టీ మార్పిడి వార్తలను ఆయన సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. అధిష్ఠానంపై ఆగ్రహమే తప్ప పార్టీ మారేంత సీరియస్‌ నిర్ణయాన్ని దామోదర తీసుకోరని పార్టీ వర్గాలూ భావిస్తున్నాయి. మొత్తానికి దామోదర, తన సైలెన్స్‌తో.. పార్టీలో హస్తిన వరకూ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన తనను విస్మరిస్తే.. పార్టీకి నష్టం తప్పదన్న సంకేతాన్ని తన మౌనం ద్వారా పంపుతున్నారు. మరి కాంగ్రెస్‌ హైకమాండ్‌.. దామోదర సైలెన్స్‌ను బ్రేక్‌ చేస్తుందా..? ఆయన అలకను ఎలా తీర్చనుంది..? వేచి చూడాలి. 

 

Don't Miss