ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడులు

07:22 - September 13, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్ధులపై వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. విద్యార్థులను కేవలం ర్యాంకుల యంత్రాలుగా చూస్తున్నాయి. అందుకే వారిని క్రమశిక్షణ పేరుతో హింసిస్తున్నాయి. చిత్రహింసలకు గురిచేస్తున్నాయి. బట్టీ చదువుల కోసం మానసిక ఒత్తిడికి గురిచేస్తుననాయి. బట్టీ చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను శిక్షల పేరుతో హింసించడం ఈ మధ్యకాలంలో మరింత పెరిగింది. దీంతో విద్యార్థులు ఆత్మహత్యలవైపు మొగ్గుచూపుతున్నారు.

యూనిఫాం వేసుకురాలేదని బాలుర బాత్‌రూం దగ్గర
బీహెచ్‌ఈఎల్‌లోని రావూస్‌ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థిని యూనిఫాం వేసుకురాలేదని బాలుర బాత్‌రూం దగ్గర నిల్చోబెట్టారు. దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని చదువుకే స్వస్తి పలకాలని భావించింది. మొన్నటికి మొన్న మెహదీపట్నంలో నెహ్రూ చిల్డ్రన్‌ స్కూల్‌లో సెకెండ్‌ క్లాస్‌ చదువుతున్న బాలుడు నత్తితో బాధపడుతున్నాడు. నత్తితో సరిగ్గా చదవడం లేదని ఏకంగా ప్రిన్సిపాలే తీవ్రంగా ఆ బాలుడిని దండించాడు. దీంతో ఆ బాలుడి వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయత్రి కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని ముగ్గురు లెక్చరర్స్‌ సరిగ్గా చదవడంలేదంటూ క్లాస్‌రూమ్‌లో, స్టాఫ్‌ రూమ్‌లో చితకబాదారు. మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ఐదు అంతస్తుల బిల్డింగ్‌ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇలా కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులను మాసనిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. బంగారు భవిష్యత్‌ కోసం కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులను చేర్చడమే తల్లిదండ్రుల పాపమైపోయింది.ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు శిక్షలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది ఉంటారు. అంతేకాదు.. వారంతా బీఈడీ, డీఎడ్‌ చదవి ఉంటారు.

విద్యాసంస్థల్లో కార్పొరల్‌ పనిష్మెంట్స్‌ కనిపించవు
అంటే విద్యార్థుల మానసిక స్థితి ఎలా ఉంటుందో వారికి తెలుసు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఏవిధంగా పాఠాలు బోధించాలో వారితో ఏవిధంగా మెలగాలనే విషయాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరల్‌ పనిష్మెంట్స్‌ కనిపించవు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ప్రతీది బిజినెస్‌ కిందే చూస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకుల కోసం పరుగులు పెట్టిస్తారని... క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను శిక్షిస్తుంటారని ఆరోపిస్తున్నారు. దీనికంతటికీ ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడమే కారణమని చెబుతున్నారు. కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలలు విద్యావ్యాపారాన్ని విడనాడితేనే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంత వాతావరణంలోనే విద్యార్థులు చదువగలరు. అప్పుడే వారి భవిష్యత్‌కు బాటలు వేసుకోగలరు. 

Don't Miss