ఐటీ దాడులు..ఎవరి ప్రయోజనాల కోసం..

20:34 - May 16, 2017

ఆరోపణలు వినిపిస్తున్నాయి..కేసులు తిరగతోడుతున్నారు..ఐటీ శాఖ దాడులు చేస్తోంది..అవినీతి అవినీతి అంటూ విరుచుకుపడుతున్నారు..ఇవన్నీ మరొకరి ప్రయోజనాల కోసం జరుగుతున్నాయా? లేక వాటికవే సందర్బానికి తగినట్టు తెరపైకి వస్తున్నాయా? ఏ అడుగుల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి? విపక్షాలే టార్గెట్ గా పరిణామాలు సాగుతున్నాయా? దీనిపై ప్రత్యేక కథనం..రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ ఉండదు.. అధికార పక్షం పూనుకుంటే కేసులకు లెక్కాపత్రం ఉండదు.. ఇప్పుడు కనిపిస్తున్న సీన్ ఇదేనా? బీహార్ లో లాలూ, ఢిల్లీలో కేజ్రీవాల్.., తమిళనాట చిదంబరం..ఇలా వరుసకడుతున్న పరిణామాలు ఏం చెప్తున్నాయి? ఏ సంకేతాలిస్తున్నాయి? ఎవరి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి? ఎలాంటి సందేహాలు వస్తున్నాయి? చిదంబరం పరిస్థితి ఇలా ఉంటే.. లాలూ ఫ్యామిలీ చిక్కులు మరింత బలంగా కనిపిస్తున్నాయి. ఓ పక్క ఐటి దాడులు... మరోపక్క తిరగదోడుతున్న కేసులు లాలూ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతున్నదేనా? లేక అసందర్భంగా కనిపిస్తోందా? ఆరోపణలు వస్తే విచారణ జరగాలి..స్కాముల్లో ఇరుక్కుంటే నిజాల నిగ్గు తేల్చాలి..అక్రమాలు చేస్తే విచారించి నేరం నిరూపణైతే జైల్లో పెట్టాలి.. ఈ విషయాలు ఎవరూ కాదనరు. కానీ, అవి జరుగుతున్న సమయం సందర్భం.. జరుగుతున్న తీరు ఇప్పుడు అనేక ప్రశ్నలకు కారణం అవుతోంది. అటు చిదంబరం అయినా... ఇటు లాలూ కుటుంబమైనా..ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా... ఎవరి విషయంలో అయినా.. ఇలాంటి సందేహాలే వస్తున్నాయి. ఈ ఆరోపణల తీరును, వరుసగా జరుగుతున్న దాడిని పరిశీలిస్తే...దీనివెనుక ఎవరి ప్రయోజనాలున్నాయా అనే ప్రశ్నలు రావటం సహజం. అవినీతికి పాల్పడితే.. ఆ నేత ఎంతటివారైనా విచారించి శిక్షించాలి. కానీ, కేంద్రంలో మోడీ సర్కారుపై విరుచుకు పడే నేతలను.. బీజెపీని తట్టుకుని తమ హవా కొనసాగించగల సామర్ధ్యం ఉన్న నేతల చుట్టూ ఇలాంటి ఆరోపణలు ఒక్కసారిగా రావటం.. సీబీఐ, ఐటీ దాడులు, అవినీతి ఆరోపణల గందరగోళం ఏర్పడటంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

Don't Miss