పూర్ణిమ ముంబై ఎందుకు వెళ్లింది..?

12:50 - July 17, 2017

హైదరాబాద్ :  నిజాంపేటలోని అమృతసాయి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న నాగరాజు, విజయకుమారిలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె పూర్ణిమ సాయి ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతోంది. గత నెల 7వ తేదీన స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన పూర్ణిమ తిరిగి ఇంటికి రాలేదు. దాంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు 15 బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు షిర్డీ, పుణె తదితర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో ఈనెల 13న కిడ్నాప్‌ కేసుగా మార్చారు.

మారుపేరుతో ఉంటున్నట్లు
ఈ నేపథ్యంలోని పూర్ణిమ సాయి ముంబైలోని దాదర్ సమీపంలోని ఓ ఆశ్రమంలో మారుపేరుతో ఉంటున్నట్లు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు సమాచారం అందింది. సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో పూర్ణిమ ముంబై వెళ్లి దాదర్‌లోని ఓ సినిమా స్టూడియో దగ్గర తిరుగుతుండగా అక్కడి పోలీసులు డొంగరి బాల్ సుధార్ ఆశ్రమంలో చేర్పించినట్లు తెలుస్తోంది. వారికి తాను ఒక అనాథనని.. తనపేరు అనికాశ్రీ అని చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ తుకారంగేట్‌లోని సాయిశ్రీ అనాధాశ్రమం నుంచి వచ్చానని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పూర్ణిమ ఫోటోలను దాదర్‌లోని బోయవాడ పోలీసులు ముంబైలోని గోడలకు అంటించారు. ఈ విషయం హైదరాబాద్‌ పోలీసులకు తెలియడంతో పూర్ణిమ ఆచూకీ తెలిసింది. మరోవైపు 40 రోజులుగా పూర్ణిమ ఆచూకీ దొరక్క కుమిలిపోతున్న తల్లిదండ్రులు ఆమె ముంబైలో ఉన్నట్లు తెలియడంతో సంతోషంలో మునిగిపోయారు. ఆదివారం పూర్ణిమ పుట్టినరోజు కావడం.. అదే రోజు ఆమె క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss