మాహిష్మతి కాదు.. అమరావతీ..

20:08 - September 20, 2017

అమరావతీ ఊపిరి పీల్చుకో...రాజమౌళి వస్తున్నాడు.. మాహిష్మతి కాదు.. దాని తలదన్నే డిజైన్లతో భవనాలు సెలక్ట్ చేయబోతున్నాడట.. అమరావతిలో ముఖ్యమైన భవనాల డిజైన్ల విషయంలో జక్కన్న క్రియేటివిటీ వాడబోతున్నారు. దేశ విదేశాల ఆర్కిటెక్కులు, ఎన్నో ఏజన్సీలు చేయలేని పనిని రాజమౌళి చేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారు. ఈగ ఎగిరినట్టే, ఉదయఘర్ సామ్రాజ్యం వెలిగినట్టే, మాహిష్మతి అబ్బురపరిచినట్టే, అమరావతి డిజైన్లు కూడా వస్తాయని ఏపీ సర్కారు భావిస్తోందా? ఇది కావాలని చేస్తున్న కాలయాపనా? లేక మహిష్మతి పట్ల చంద్రబాబుకున్న ఇష్టమా?

అమరావతి..భ్రమరావతి..మాహిష్మతమరావతి ..డిజైన్లు, సంస్థలు, ఆర్కిటెక్కులు మారుతున్నట్టే... అమరావతికి మారుపేర్లూ పెరుగుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ సర్కారు చేస్తున్న స్టంట్లు అనేక ప్రశ్నలను రేరెత్తిస్తున్నాయి. అనేక విమర్శలకు కారణమౌతున్నాయి. గుళ్లూ గోపురాలను డిజైన్ చేయించుకున్నారంటే ఓ అర్ధముంది..ఫ్యాట్ వెడ్డింగ్ డిజైనర్లుగా సలహా అడిగారంటే అర్ధం చేసుకోవచ్చు..కానీ, ఓ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భవనాల డిజైన్ల గురించి ఓ డైరెక్టర్ ని సంప్రదించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. మరి సర్కారీ యంత్రాగంలోని ఆర్కిటెక్కులు.. కోట్లు ఛార్జ్ చేసి డిజైన్లు ఇచ్చిన కన్సల్టెంట్ లు వీరికంటే ఓ సినిమా నిపుణుడికి ఎక్కువ తెలుస్తుందా?

దేశ విదేశాల ఆర్కిటెక్కుల ప్రతిభ సరిపోలేదు..మూడేళ్ల కాలం, పర్యటనల మీద పర్యటనలు నడిచాయి.. డిజైన్లు రావటం... పక్కకు పోవటం జరిగిపోతూనే ఉన్నాయి.. కానీ, బాబుగారి కన్ను మాహిష్మతి మీద పడింది. ఆ రేంజ్ డిజైన్లు కావాలంటున్నారు. గ్రీన్ మ్యాట్ అద్భుతాలను రియల్ లైఫ్ లో సాకారం చేయాలని భావిస్తున్నారు. మరి ఇది కాలయాపన వ్యవహారమా? లేక పనిజరిగేదేమైనా ఉందా? రాజధాని అంటే నాలుగు రోడ్లు, పది భవనాలు, ఓ పార్కు మాత్రమే కాదు.. అక్కడి ప్రజలు, వారి బాగోగులు , ఇతర ప్రాంతాలకు కూడా పాలనా పరంగా అందుబాటులో ఉండటం, పారదర్శక విధానాలు అని గుర్తిస్తే ఆధునిక అమరావతి కల సాకారమయినట్లే.. ఈ దిశగా సాగకుండా జై మాహిష్మతీ అంటూ కలలు కంటే ప్రయోజనం ఉంటుందా? గ్రాఫిక్స్ డిజైన్లను వాస్తవంలో కావాలనటంలో అర్ధం ఉందా? పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss