మరణానికి దారి బ్లూ వేల్ గేమ్..?

20:42 - September 8, 2017

సరదాగా మొదలౌతుంది. రక్తం చిందటంతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా ఆటలాడిస్తుంది. అంతా గేమ్ లో భాగం అనుకుంటారు. కానీ, అది వాడి స్క్రీన్ ప్లేలో భాగమని గుర్తించలేరు. ఆడిస్తూ, పాడిస్తూ, బెదిరిస్తూ చివరకు చావుముంగిట్లోకి పిల్లలను లాక్కెళుతోందా గేమ్. అదే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. చావుతో ఛాలెంజ్ చేసే పరిస్థితి లేతబుగ్గల చిన్నారులకు ఎందుకు వస్తోంది? ఎవరా పరిస్థితి కారణమౌతున్నారు? ఈ డెత్ గేమ్ లబారినుండి పిల్లలను కాపాడేదెలా? క్యాండీ క్రష్, జెల్లీ సాగా, కలర్ స్విచ్, పియానో టైల్స్, పొకెమాన్, టెంపుల్ రన్, ఈ పేర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇంకా చెప్తే ఇవన్నీ అవుట్ డేటెడ్. కానీ, ఈ గేమ్ ల సరసన ఓ డెత్ గేమ్ ఎంటరయింది. వచ్చీ రాగానే చావుమేళం మోగిస్తోంది. సరిగ్గా 50 రోజుల్లో చిన్నారుల ఉసురు తీస్తోంది. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగులుస్తోంది.

ఫైనల్ స్టేజ్ ఆత్మహత్య
తీరానికి వచ్చి బ్లూవేల్స్ అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయి. అదే పేరును ఈ గేమ్ కి పెట్టారు. పేరుకి తగ్గట్టుగానే దీని ఫైనల్ స్టేజ్ ఆత్మహత్యతో ముగుస్తుంది. పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టుగా చిన్నారులు, బలహీన మనస్తుల.. ఇది ఆడించినట్టల్లా ఆడి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ ఓ హిప్నాటిక్ గేమ్.. రష్యాలో వందలమంది టీనేజర్లు బలయ్యారు. చూడటానికి జస్ట్.. ఓ మొబైల్ గేమ్ అనిపిస్తుంది .. కానీ, 10 నుంచి 14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట లేత మనసులను దారుణంగా వేటాడేస్తుంది. భావోద్వేగాలతో ఆడుకుంటూ, పసి హృదయాలను మృత్యుముఖంలోకి తోసేస్తుంది. ఈ ప్రాణాంతక క్రీడను రూపొందించిన సైకో డెవలపర్ ఫిలిప్ బుడేకిన్‌ను రష్యా పోలీసులు అరెస్టుచేసినా, ఆ ఆట అనేక కాపీ ప్రోగ్రామ్ ల రూపంలో ఇంటర్నెట్ లో వివిధ దేశాలకు విస్తరిస్తూనే ఉంది.

నిన్నటిదాకా పోకెమాన్
ఇప్పుడు బ్లూ వేల్ ఛాలెంజ్.. సవాల్ విసురుతోంది. నిన్నటిదాకా పోకెమాన్ సంచలనం కలిగించింది. అంతకుముందు ఛోకింగ్ గేమ్ ఊపిరి తీసింది. అన్నిటికీ కారణం స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్.. అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఫోన్.. ఇప్పుడు సమాచారం కోసం కంటే... వినోదానికి, అంతకంటే వికృత చేష్టలకు ఎక్కువగా ఉపయోగపడుతోంది. సాంకేతిక ప్రగతి ఎంటర్ టైన్ మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అదే సమయంలో వినోదాన్ని హై ఎండ్ కి తీసుకెళ్లే అప్లికేషన్లు కొన్ని, ప్రమాదాల అంచుకు లాక్కెల్లే గేమ్ లు మరికొన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మనుషులు బయటి ప్రపంచాన్ని వదిలేసి వర్చువల్ వాల్డ్ కి పరిమితం అవుతూ సామాజిక జీవనాన్ని మరచిపోతున్నారు. ఇప్పుడు బ్లూవేల్ లాంటి గేమ్ లు ఆ ప్రమాదాన్ని మరింత పెంచే అవకాశముంది. రెండంచుల కత్తిలాంటి టెక్నాలజీని వాడుకోవటంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు జీవితమే చేజారుతుంది. కీప్ వాచింగ్ టెన్ టీవీ. న్యూస్ ఈజ్ పీపుల్.

 

Don't Miss