50రోజులు..

21:29 - December 28, 2016

50రోజులు దాటాయి.. నిలబడ్డవాళ్లు నిలబడ్డట్టే ఉన్నారు..ఎదురు చూపుల కళ్లు ఎదురు చూస్తూనే ఉన్నాయి..బ్యాంకుల చుట్టూ తిరిగి నడుములు విరిగిపోతూనే ఉన్నాయి.. చేతిలో సొమ్ము లేదు. ఉన్నా చిల్లరలేదు. ఏంటీ కష్టం. ఎందుకీ సమస్య..ఎవర్ని బాగు చేయటానికి? ఏం సాధించటానికి? 50 రోజుల అచ్ఛేదిన్ చూసి దేశమంతా పరవశిస్తోందా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. కుటుంబపెద్ద ఓ నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసానాలు ఆలోచిస్తాడు.. మరి దేశానికి పెద్ద ఈ విషయం ఆలోచించలేదా? ఒక్కసారి ఇంతటి నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో గ్రహించలేకపోయారా? ప్రధాని మోడీ నిర్ణయం బెడిసికొట్టిందా? తాను ఫకీరునని చెప్పుకుంటున్న ప్రధాని ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు? కూటి కోసం కూలి కోసం.. పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం.. ఎప్పుడో శ్రీశ్రీ రాసిన మాటలివి. ఇప్పుడు దేశం పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. చేద్దామంటే పనిలేదు. చేతిలో చిల్లగవ్వలేదు.. తినటానికి తిండిలేదు.. కుటుంబాన్ని సాకటానికి సొమ్ములేదు. రోగమొస్తే దిక్కులేదు. ఎంత కష్టం.. ఎంత కష్టం.. ఎన్నాళ్లీ కరెన్సీ సమస్య.. క్యాష్ లెస్ అంటూ సర్కారు చెప్తున్న మాటలు ఎంతవరకు సాధ్యం? భారత అర్ధిక వ్యవస్థపై ముఖ్యంగా అసంఘటితరంగంపై తీవ్రప్రభావం చూపింది.చెప్పిందొకటి జరుగుతున్నదొకటి.. 50 రోజులుగా సాధారణ జీవితం గడపటానికి నానా పాట్లు.. చెప్పిందొకటి జరుగుతున్నదొకటి.. మీటింగుల్లో హావభావాలతో వదిలిన డైలాగులు ఒకటి.. కళ్లముందున్న విషయం మరొకటి.. నల్లధనం.. నకిలీ నోట్లు అడ్రస్ లేవు.. ప్రజలు మాత్రం 50 రోజులుగా సాధారణ జీవితం గడపటానికి నానా పాట్లు పడుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ లేదు..స్వైపింగ్ మెషీన్లు లేవు..స్మార్ట్ ఫోన్ ల వాడకం అంతంత మాత్రమే..ప్రశ్నార్థకంగా మారిన డెబిట్ కార్డుల సేఫ్టీ..క్యాష్ లెస్ భారతం అంత సులభంగా సాధ్యమౌతుందా? దేశ ప్రజల స్థితిగతులను బట్టి నిర్ణయాలుండాలి. గ్రామీణ ప్రజలు అధికంగా ఉన్నచోట, సాంకేతికంగా సవాళ్లు ఉన్నచోట క్యాష్ లెస్ గా మారటం అంత సులభ సాధ్యమేమీ కాదు. మరోపక్క ప్లాస్టిక్ కరెన్సీ మాత్రమే నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికడుతుందంటే నమ్మశక్యం కాని పరిస్థితి.. 50 రోజులుగా నరకం చూస్తోంది దేశం.. ఈ సిచ్యుయేషన్ మరెన్ని రోజులంటే సమాధానం లేని పరిస్థితి కనిపిస్తోంది. 

Don't Miss