డీమానిటైజేషన్..అష్టకష్టాలు..

20:12 - March 15, 2017

నాలుగు నెలలు దాటింది.. ఎన్నికల ఫలితాలూ వచ్చేశాయి. మరో పక్క సీన్ రివర్సయింది. రిజల్ట్ తిరగబెడుతోంది. మళ్ళీ ఏటీఎం కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నగదు సమస్య మరింత తీవ్రమయింది. ఈ సమస్య పరిధి ఇంతేనా? లేక దేశంపై భారీ ఎత్తున ప్రభావం చూపబోతోందా? నగదు కొరత రైతన్న బతుకులను కూలుస్తోందా? చిన్న వ్యాపారాలను, పరిశ్రమల ఆయువు తీస్తోందా? ఏం జరుగుతోంది? ఈ అంశంపై ప్రత్యేక కథనం. నాలుగు పనిచేయని ఏటీఎంలు. నెలజీతం డ్రా చేయలేని ఉద్యోగులు.. ఏటీఎంల దగ్గర నిలబడిన కొందరు సామాన్య ప్రజలు.. ఇదేనా సమస్య.. ఇంతేనా నగదు రద్దు ప్రభావం..? ఎంత మాత్రమూ కాదని పరిశీలనలు చెప్తున్నాయి. డీమానిటైజేషన్ తో దేశంలో ఎన్ని రంగాలు అష్టకష్టాలు పడుతున్నాయో ఊహించగలరా? ఎందరు కోలుకోలేని దెబ్బ తిన్నారో తెలుసా?

అసంఘటిత రంగం..
రైతన్న బతుకంతా ఏదో ఒక గండమే.. ప్రకృతి విపత్తులు తరచుగా కాటేస్తుంటే.. ఈ ఏడాది ప్రభుత్వ నిర్ణయం నిండా ముంచుతోంది. అంతులేని కష్టాలను తెచ్చిపెడుతోంది. అడుగడుగునా కరెన్సీ సమస్య ఎదురవుతూ రైతన్నను ఎక్కడలేని సమస్యలో పడేసింది. కూటి కోసం కూలి కోసం.. పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం.. ఎప్పుడో శ్రీశ్రీ రాసిన మాటలివి. ఇప్పుడు దేశం పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. చేద్దామంటే పనిలేదు. చేతిలో చిల్లగవ్వలేదు.. తినటానికి తిండిలేదు.. కుటుంబాన్ని సాకటానికి సొమ్ములేదు. రోగమొస్తే దిక్కులేదు. ఎంత కష్టం.. ఎంత కష్టం.. ఎన్నాళ్లీ కరెన్సీ సమస్య.. భారత అర్ధిక వ్యవస్థపై ముఖ్యంగా అసంఘటిత రంగంపై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపుతోంది..

కోలుకోలేనంత దెబ్బ..
పాలపాకెట్ల నుండి... పచారీ సరుకుల వరకు..నిత్యం కరెన్సీ నోట్లు అవసరమమే.. తొంభై శాతం జనాభా కరెన్సీ నోట్లపై ఆధారపడి నిత్యజీవిత అవసరాలను తీర్చుకునే కరెన్సీ లేకుండా చేసి ప్రజల జీవితాలను సంక్షోభంలో పడేసేలా సర్కారు చర్య మారింది. అయిందేదో అయింది.. అంతా సర్దుకుంటోందని అనుకున్నారు. అంతలోనే సీన్ రివర్సయింది. నవంబర్ 8న ఎలాంటి పరిస్థితి ఉందో మళ్లీ అదే సీన్ కనిపిస్తోంది. పనిచేయని ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర పెరిగిన రద్దీ.. చుట్టుముట్టిన కరెన్సీ కష్టాలు.. వెరసి తెలుగు రాష్ట్రాలు నగదు లేక విలవిల్లాడుతున్నాయి. మరోపక్క గ్రామీణ భారతం కోలుకోలేనంత దెబ్బతింటోంది. వెరసి రాబోయే కాలంలో ఈ ఫలితాలు స్పష్టంగా కనపడబోతున్నాయని చెప్పాలి.
ఈ అంశంపై పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss