మోడీ మొక్కుబడి ప్రకటనల ప్రయోజనం ఎంత ?

20:24 - July 17, 2017

మాటలదేముంది బాస్ ఎన్నైనా చెప్పొచ్చు.. కానీ, వాటిలో నిజం ఎంత? నిజాయితీ ఎంత అనేదే ముఖ్యం. ఓ స్టేట్ మెంట్ ఇచ్చేస్తే అదే పడుంటుంది.. అనుకుంటే ప్రయోజనం ఏముంటుంది.. ఓ పక్క జరగాల్సిందంతా జరుగుతోంది. దేశంలో దళిత బహుజనులు మైనార్టీలపై అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి.. గోరక్షణ పేరుతో పూటకోచోట విరుచుకుపడుతూనే ఉన్నారు.. ఇవన్నీ ఓ పక్కన రక్తపాతాన్ని సృష్టిస్తుంటే మాన్య ప్రధాని మోడీ గారు ఠాఠ్..!! గోరక్షణ పేరుతో దాడులా చెల్లవు.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అంటున్నారు. మరి వినేవాడుండాలే కానీ.. చెప్పటానికేముంది అంటారా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..

ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవాలి ?
గోరక్షణ పేరుతో జరిగే దాడుల్ని అడ్డుకోవాలి. కఠిన చర్యలు తీసుకోవాలి.. మంచి మాట సెలవిచ్చారు. అమలైతే సంతోషమే. దానికి తగిన పరిస్థితులు ఏర్పడితే బ్రహ్మాండమే. కానీ, ఓపక్క గోవు పవిత్రత ఎంతో, దాని ఉపయోగాలెంతో తేల్చే ప్రయోగాలు చేయండి.. అంటూనే గోరక్షణ పేరుతో దాడులు సహించం అననటంలోనే.. ఎక్కడో తేడా కొడుతోందా? అసలు దేశంలో ఏం జరుగుతోంది? ప్రధాని వ్యాఖ్యలకు, కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన లేకుండా ఎందుకు పోయింది? ఓ పక్క జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంలాంటి దేశ స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి.. వీటన్నిటిని వదిలేసిన ప్రధాని ఇప్పుడీ ప్రకటన చేయటానికి ఎలా అర్ధం చేసుకోవాలి?

భిన్నత్వంలో ఏకత్వం...
భిన్నత్వంలో ఏకత్వం...ఇదీ మనదేశపు ఐడెంటిటీ..మన సమాజ గొప్పతనం.. దానికి మన రాజ్యాంగం అవసరమైన బలాన్నిచ్చింది. కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఏ కోణంలో అర్ధం చేుకోవాలి ? ఇతర మతాలను, ఈ దేశ మూలవాసులను అణగదొక్కుతున్న పరిస్తితి కనిపిస్తోందా? ఆవు పేరుతో అసహనం రాజ్యమేలుతోంది.. పైగా ఇటీవలే సర్కారు వారు బీఫ్ బ్యాన్ విషయంలో సర్కారు పలు నిర్ణయాలు తీసుకున్నారు. పెంచండి..పాలు పితుక్కోండి.. కానీ, కోసుకు తినటానికి అమ్మకండి.. అన్నతీరులో.. ఓ పక్క ప్రజల ఆహార స్వేచ్ఛ హరిస్తూ, మరోపక్క రైతులపై భారం మోపేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బీఫ్ తినే అవకాశం లేని పరిస్థితి క్రియేట్ చేస్తోంది. అమ్మటానికి పశువులు అందుబాటులో లేకుండా సర్కారు వ్యవహరిస్తోంది. పరోక్షంగా గోరక్షణ దళాలకు మద్దతిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్న మాట వాస్తవం.. కులం, మతం ఏ జాతినీ నీతినీ నిర్మించలేవు అని బాబా సాహెబ్ చెప్పిన మాటలు ఎటు పోయాయి? మతం పేరుతో గోవుకు మొక్కి, మనిషిని చంపే జాతి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? ఊహించటానికే భయం కలిగించే అంశం.. ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిన ప్రధాని చేసే మొక్కుబడి ప్రకటనల ప్రయోజనం ఎంత?
పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి...

Don't Miss