రాజకీయంలో ఏది నీతి..?

20:11 - August 8, 2017

నిజాయితీకి, నీతికి, స్వచ్ఛతకి తామే హోల్ అండ్ సోల్ బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకుంటారు. ఉపన్యాసాలు దంచుతారు. నీతులు వల్లెవేస్తారు. కానీ, అసలు విషయానికి వస్తే మాత్రం ఇంతకంటే దిగజారటానికి మరేమీ ఉండదనిపిస్తుంది. ఎన్ని ఎత్తులు.. ఎన్ని జిత్తులు.. ఎంత వికృత క్రీడ.. రాజకీయాలంటే అమ్మకాలు కొనుగోళ్లే అని ఏదో సినిమాలో చెప్పినట్టు.. అధికారం కోసం, పైచేసి కోసం, పట్టు సాధించటం కోసం.. దేనికైనా వెనుకాడని పరిస్థితి కమలదళంలో స్పష్టంగా కనిపిస్తోందా? అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు,బీహార్ లేటెస్ట్ గా గుజరాత్... ఇలా వరుసగా పలురాష్ట్రాల్లో ఆ పార్టీ వ్యవహారశైలి ఇదే అంశాన్ని చెప్తోందా? ఈ గుజరాత్ మోడల్ నే దేశమంతా అనుసరించనున్నారా? ఈ మాట మన దేశంలో చాలా పాతది.. గోడదూకే రాజకీయాలకు, ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి...పబ్బం గడుపుకునే పార్టీలకు మన రాజకీయాలు అడ్డాగా మారి ఎన్నో ఏళ్లయింది. అయితే.. తొండముదిరి ఊసరవెల్లిగా మారినట్టు.. మన పార్టీలు ఈ విషయంలో పీక్స్ కు చేరుతున్నాయి. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కనిపించిన పరిణామాలు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సభ్యులంతా ఆ పార్టీతోనే ఉంటే, ఆ ఒక్క సీటు గెలవటం, అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక అవటం నల్లేరుపై నడకే. కానీ, దానిపై బీజెపీ కన్నేసింది. దానికోసం పక్కాగా అడుగులు వేసింది. ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంది. చివరి క్షణం వరకు అడ్డదారిలో అధికారం కోసం అడుగులు వేస్తూనే ఉంది.. ఇప్పుడు ఇరకాటంలో పడింది.

Don't Miss