అమెరికాలో భారతీయులకు భద్రత లేదా ?

20:40 - February 24, 2017

అమెరికాలో భారతీయులకు భద్రత లేనట్టేనా? పక్కనే ప్రమాదం పొంచి ఉన్నట్టేనా? వరుసగా జరుగుతున్న ఘటనలు ఏం చెప్తున్నాయి? నెత్తికెక్కిన జాత్యహంకారం లక్షలాది భారతీయలు భవితను ప్రశ్నార్ధకంగా మారుస్తోందా? డాలర్ డ్రీమ్స్, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో అమెరికా చేరిన ఎందరో తెలుగు వారి పరిస్థితి ఇప్పుడేంటి? భయం గుప్పిట్లో బతకాల్సిందేనా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ.. అంతెత్తున కనిపిస్తుంది. స్వేచ్ఛ సమానత్వం.. అవకాశాలు.. అంటూ నినాదాలు వినిపిస్తాయి. కానీ, అదంతా మాటలకే పరిమితమా? అమెరికా ఇక ఎంత మాత్రం సేఫ్ కంట్రీ కాదా? ట్రంప్ లాంటి వాడి పాలనలో.. జాత్యహంకారం జీర్ణించుకున్న ప్రజలు పెరుగుతున్న సమయంలో అమెరికాలో భారతీయులు ప్రమాదంలో పడినట్టేనా?

రక్త చిందింది..
కాన్సస్ బార్ లో రక్తం చిందింది.. ఇద్దరు తెలుగు యువకులపై కాల్పులు జరిగాయి. ఒకరు మరణించారు.. మరొకరు గాయాలపాలయ్యారు.. నిట్టనిలువునా జీర్ణించుకున్న జాత్యహంకారం తుపాకీ పట్టి రాజ్యమేలుతుంటే అక్కడి తెలుగు వారు గజగజ వణకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందా? ఇది మొదటిదేం కాదు.. గతంలో కూడా ఎన్నో ఘటనలు జరిగాయి. ఓ పక్క అమెరికాలో పెరుగుతున్న క్రైమ్ రేట్ .. గన్ కల్చర్ నేరాల సంఖ్య పెరగటానికి కారణం అవుతుంటే, ట్రంప్ వచ్చిన తర్వాత మరో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అసంతృప్త అమెరికన్ వైట్స్ తెగించి దాడులకు దిగుతున్నారు.. తమనెవ్వరేం చేయలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.. వరుస ఘటనలు అనేక భయాలు.. దేశం కాని దేశంలో రక్షణ ఎంత? ప్రజాస్వామ్యం, సమానత్వం, రక్షణ అంటూ నినాదాలిచ్చే అమెరికాలో ఇప్పుడు భారతీయులు టార్గెట్ గా మారారా? ఈ ఘటనలు ఏ సంకేతాలిస్తున్నాయి?

సర్వమానవ సమానత్వమే అంతిమ గమ్యం..
ఏ దేశమైనా, కులం, మతం, వర్ణం, జాతి లాంటి జాడ్యాలను పట్టుకువేలాడితే ఏనాటికీ ముందడుగు వేయలేదు. అది అమెరికా, అయినా భారత్ అయినా సర్వమానవ సమానత్వమే అంతిమ గమ్యం కావాలి. అదే ప్రజాస్వామ్యాన్ని వేయి చేతులతో కాపాడుతుంది. లేదంటే రాతియుగపు ఆనవాళ్లతో ఆ సమాజానికి అధోగతి తప్పదు.. ఇప్పుడు అమెరికాలో జరిగిన ఘటన నేర్పే పాఠాలివే. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss