ఎవరి పక్షం..? ఎవరికి అనుకూలం..?

20:32 - February 1, 2017

జైట్లీ బడ్జెట్ ఏ సంకేతాలిచ్చింది? అంకెల గారడీ మాత్రమేనా? లేక ప్రజానుకూల అంశాలున్నాయా? కార్పొరేట్ పక్షమా లేక, సామాన్యుడి పక్షపాతమా?

వరాలా? వడ్డనలా? లేక సబ్సిడీలు ఎత్తేసే ప్రయత్నమా? మోడీ సర్కారు ఎవరి పక్షాన నిలిచిందో, ఈ బడ్జెట్ చెప్తోందా? డీమానిటైజేషన్ తర్వాత అతలాకుతలమైన దేశ ఆర్ధిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయిందా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..ఉత్కంఠకు తెరపడింది. బడ్జెట్ వస్తుందంటే సామాన్యుడి నుండి కార్పొరేట్ వర్గాల వరకు అందరికీ ఆసక్తే. మోడీ సర్కారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఏ కబురు మోసుకొస్తుందోననే సస్పెన్స్ కు, ఆర్థికమంత్రి సూట్ కేస్ లో ఏముందోననే ఆత్రుతకు ముగింపు పడింది. మోడీ సర్కారు ప్రాధాన్యతలేంటో స్పష్టమౌతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి..
సంక్షేమ పథకాల పరిస్థితేంటి?
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. డీ మానిటైజేషన్.. దేశాన్ని గత నవంబర్ నుంచి అతలాకుతలం చేసి, దేశ ఆర్ధిక వ్యవస్థను ఊహించనంత దెబ్బకొట్టిన తర్వాత వచ్చిన ఈ బడ్జెట్ ఆ సమస్యలన్నిటినీ వదిలేసిందా? అసలు సమస్యలను పక్కనపెట్టి... పైపై మెరుగులతో సరిపెట్టిందా? సంక్షేమ పథకాల పరిస్థితేంటి? గత కొన్నేళ్లుగా ఏ ప్రభుత్వం ఉన్నా కేటాయింపుల్లో పెద్ద మార్పులేం లేవు.. బడాబాబులకు లక్షల కోట్ల పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు ప్రకటించే ప్రభుత్వాలు సామాన్యుడి సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయనటానికి ఎన్నో ఉదాహరణలు.. మరి తాజా బడ్జెట్ ఏం చెప్తోంది?

ఎవరి బాగోగుల కోసం...
ప్రభుత్వాలు ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి? ఎవరి బాగోగుల కోసం ఈ పాలనా వ్యవస్థ నడుస్తోంది? నిజాలు తలక్రిందులై, వ్యవస్థ రివర్స్ లో నడుస్తుంటే ఇంతకంటే మంచి బడ్జెట్ లు ఎలా వస్తాయనే ఘాటు విమర్శలు వినిపిస్తున్నాయి. దేశ మంటే మట్టి కాదు.. మనుషులోయ్ అని భావించాల్సిన చోట.. పిడికెడు వ్యక్తుల ప్రయోజనమే జాతి ఉమ్మడి ప్రయోజనంగా ఆర్ధిక విధానాలు, బడ్జెట్ రూపకల్పనలు సాగుతున్నాయి. సామాన్యుడి ఆశలు చాలా చిన్నవి. బడుగు బతుకుల్లో కాస్తవెలుగు రావాలని ఎన్నో ఆకాంక్షలు. కానీ, అవి నెరవేరే మార్గాలు కనిపించని పరిస్థితి. మత్స్యన్యాయం లాగా చిన్న చిన్న చేపలనుపెద్ద చేపలను మింగే సంస్కృతిని ప్రోత్సహిస్తే దేశానికి అనేక కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. చెప్పేవాటికి, చేసేవాటికి చాలా తేడా చూపుతున్నబడ్జెట్ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది.

బడ్జెట్ ఆ ప్రభుత్వ విధానాలను చెప్తుంది...
ప్రజలముందుకొచ్చిన బడ్జెట్ ఆ ప్రభుత్వ విధానాలను చెప్తుంది. ఎవరి పక్షమో స్పష్టం చేస్తుంది. దురదృష్టవశాత్తూ దేశంలో 90శాతం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన దేశ బడ్జెట్, పిడికెడు పెట్టుబడిదారులకు పట్టంకడుతోంది. వారి ప్రయోజనాలకోసం తపిస్తోంది. వచ్చీ రాగానే వాతలు పెట్టిన మోడి సర్కారు, అదే వరుసను కొనసాగిస్తోంది. కార్పొరేట్ రంగం కోసమే విధానాలు రూపొందిస్తూ ఓట్లేసిన కోట్లాది సామాన్యులను బోడి మల్లయ్యలుగా వదిలేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తాజా బడ్జెట్ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss