వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే.....!

20:16 - August 24, 2017

వ్యక్తిగత గోప్యత ఇఫ్పుడు ప్రాధమిక హక్కు..అవును సుప్రీం తేల్చేసింది. గల్లా పట్టుకుని వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, కుదరదంటోంది. మరి కొన్నేళ్లుగా కేంద్రం పౌరుల వ్యక్తిగత వివరాలు చుట్టూ చేస్తున్న హడావుడి సంగతేంటి?బ్యాంక్ ఎకౌంట్ నుంచి గ్యాస్ కనెక్షన్, పాన్ కార్డ్, ఆఖరికి మొబైల్ సిమ్ వరకు కస్టమర్ జాతకాన్ని చేతిలో పెట్టాల్సిందే అంటూ సాగుతున్న నిబంధనల సంగతేంటి? ఆధార్ కార్డ్ పై కేంద్రం ఇచ్చే బిల్డప్ ని సుప్రీం తిప్పికొట్టిందా? ఇదే ఈ రోజువైడాంగిల్ స్టోరీ..వ్యక్తిగతం అంటూ ఏదీ లేదంటూ సాగుతున్న సర్కారీ తీరుకు ఇది నిజంగా ఎదురుదెబ్బే అని చెప్పాలి. పైగా ఆధార్ పేరుతో సాగుతున్నది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కాదని సర్కారు చెప్పుకుంటోంది.. పైగా రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని కూడా అడ్డంగా వాదిస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారితీయనున్నాయి. ఇప్పటికే అన్నిటికీ ఆధార్ తో లింక్ చేస్తున్నారు. చేయని వాళ్ల మొబైల్ కు రోజూ మెసేజ్ లు, కాల్స్ వస్తున్నాయి. ఆధార్ ని మెళ్లో కట్టుకోకపోతే తప్ప బతకలేనట్టు పరిస్థితి మారుతోంది. ఈ పరిణామాల మధ్య సుప్రీం తీర్పు ఆసక్తికరంగా మారింది. ఇది ఇప్పటికే ఇచ్చిన ఆధార్ లింక్ ను, భవిష్యత్తులో చేయబోయేవాటిని ప్రభావితం చేస్తుందా?ఆధార్ ఆలోచన వచ్చిన నాటినుంచి దాని చుట్టూ అనేక విమర్శలు. కానీ ఇప్పటికే వందకోట్లమందికి పైగా ఐరిస్ స్కాన్స్ ని, వేలిముద్రల్ని ఆధార్ డేటాబేస్ తో అనుసంధానం చేశారు. బ్యాంకు ఖాతా తెరవడానికి, సంక్షేమ పథకాల లబ్ది పొందడానికి, టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి, చివరకు పదిరూపాయలు నగదు లావాదేవీ జరపడానికి కూడా ఆధార్ ను తప్పనిసరి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిస్థతిలో మార్పు వస్తుందా? ఇదే కొనసాగితే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే అవకాశాలున్నాయా?

 

Don't Miss