దీపావళి చుట్టూ అల్లుకున్న అంశాలేంటి...?

20:12 - October 19, 2017

కోటికోట్ల దీప కాంతుల సందడి.. చీకటిని వెళ్లగొట్టి వెలుతురును పూయించే సందర్భం. కొత్త బట్టలు, పిండివంటలు, ఇంకా దీపాల వరుస.. ఇదేనా దీపావళి.. ?ఎన్నో ఏళ్లుగా చూస్తున్న పండుగ.. దీని గురించి కొత్తగా చెప్పుకునేది... మాట్లాడుకునేది ఏం ఉంటుంది అనుకుంటున్నారా? కాలంగడిచే కొద్దీ కొత్త నిర్వచనాలు పుడతాయి. వేడుకలకు కొత్త అర్థాలు మొదలవుతాయి. అనర్థాలూ జతకూడుతాయి.. వెలుగునిచ్చే బదులు మరింత చీకటిని, మరింత సమస్యలను నింపుతున్న దీపావళి చుట్టూ అల్లుకున్న అంశాలేంటి? ఈ రోజు వైడాంగిల్ లో ఆ వివరాలు చూద్దాం.. చీకటినుంచి వెలుగు లోకి పయనం … కోటి కాంతుల వెలుగే దీపావళి.ప్రపంచాన్ని వెలిగించే ప్రయత్నం మంచిదే. కానీ, ఆ క్రమంలో మరింత చీకటిని నింపుకుంటున్నామా? పర్యావరణాన్ని అనారోగ్యకరంగా మార్చుకుంటున్నామా?కాదంటారా? వెలుగు నింపాల్సిన చోట కాలుష్యం పంచుతున్నామా? శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంతో వేడుక స్ఫూర్తిని దెబ్బస్తున్నామా? వెలుగురేఖల వేడుకలో ఈ అపశృతులు ఆపలేమా?దీపావళి పండుగ అసలు ఉద్ధేశ్యం ఏంటి? మనం ఎలా మారుస్తున్నాం? అదంతా సౌండ్ పొల్యూషన్ దానికి సంబంధించిన వివరాలు. మరి, క్రాకర్స్ కాలిస్తే వచ్చే పొగ వాతావరణానికి మంచిదా? దానివల్ల దోమలు చస్తాయా? వాతావరణం బాగుపడుతుందా? వచ్చే చలికాలంలో ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుందా?

దీపావళి అంటే దీపాల పండుగ కదా.. మరి దీంట్లోకి బాణాసంచా ఎక్కడి నుంచి వచ్చింది? తీర్చిన దీపాల వరుస ఆహ్లాదాన్నిస్తుంది. అంతకు మించి చీకటిని ప్రారద్రోలుతూ ప్రమిదలు వెలుగును నింపుతాయి. కానీ, పోటీపడి కాల్చే బాణాసంచా గాలిని, వాతావరణాన్ని పాడు చేస్తోంది. కాదంటారా? దీపావళి పండుగ ఎందుకు జరుపుకొంటారు? మనదేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ వేడుకను ఎలా జరుపుకుంటున్నారు? ఇతర దేశాల్లో ఇలాంటి పండుగలున్నాయా? వెలుగుకా లేక శబ్దానికా దేనికి ప్రాధాన్యం? అటు బాణాసంచాతయారీలోనే కాదు.. అమ్మకంలోనూ జాగ్రత్తలు లోపిస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు కాసేపు హడావుడి చేయటం తప్ప సర్కారు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు తక్కువే. దీంతో ప్రతిఏటా ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి.

దీపావళి అంటే దీపాల వరుస... ఈ మాట ఇప్పటికే చెప్పుకున్నాం. వేడుక ఏదయినా అందరికీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అలాంటపుడు ఎకో ఫ్రెండ్లీ దీపావళి జరుపుకోలేమా? వాతావరణానికి హాని కలిగించని హరిత దివాళీ ఎందుకు సాధ్యం కాదు?ప్రతి ఇల్లూ వెలుగుతో నిండాలి... ప్రతి జీవితం వెలుగుతో ప్రకాశించాలి. ఈ ప్రపంచమంతా వేయిరేకుల వెలుగు పూలతో పరిమళించాలి. బడుగుల బతుకుల్లో వెలుగు నిండాలి. నిరుపేదల కళ్లలో మతాబులు పూయాలి. ముప్పూటలా తినటానికి నోచుకోని బతుకుల్లో వెన్నెల వెలుగులు పరుచుకోవాలి.. అదే నిజమైన దీపావళి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss