కార్మికుడి ప్రాణాలకు విలువ లేదా ?

10:26 - February 23, 2017

గాల్లో దీపం ఎప్పుడారుతుందో ఎవరికి తెలుసు.. ఏ క్షణమైనా టప్పున ఆరిపోవచ్చు. పరిశ్రమల్లో కార్మికుడి ప్రాణం కూడా అంతే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు.. ఎటునుంచి ఏ మంటలు మింగుతాయో.. ఏ రసాయనం బతుకును కాలుస్తుందో ఊహించలేని దీనస్థితి. నిరంతరం అత్యంత అభద్ర పూరిత వాతావరణంలో ఏటా వేలాది కార్మికుల బతుకులు తెల్లారిపోతున్నాయి. సేఫ్టీని పట్టించుకోని యాజమాన్యాలు, చర్చలు తీసుకోని సర్కారీ యంత్రాంగం వెలసి కార్మికుడి ప్రాణాలకు ఏ విలువలేని పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై ప్రత్యేక కథనం.. దేశాన్ని నడిపే సజీవ యంత్రం కార్మికుడు. తన రక్తాన్ని స్వేదంగా మార్చి నిత్యం దేశాన్ని ప్రగతి పధంలో నడిపిస్తున్న కార్మికుడి జీవితానికి ఎలాంటి గ్యారంటీ లేని పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉద్యోగానికి సేఫ్టీలేదు. ఇటు ప్రాణానికి అంతకంటే లేదు. రాజేంద్రనగర్ లో జరిగిన తాజా ఘటన ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది.

రెక్కాడితే డొక్కాడని బతుకులను చిదిమేస్తున్నదెవరు? ఎవర్ని ప్రశ్నించాలి?
అది ఎయిర్ కూలర్ల ఫ్యాక్టరీ..ఎండవేడి నుంచి ఉపశమనాన్ని అందించే యంత్రాలు తయారవుతున్నాయి. కానీ, అదే ఫ్యాక్టరీ కొందరి బతుకులను బుగ్గిపాలు చేసింది. మంటల్లో నిలువునా తగులబెట్టింది.. తెల్లవారుఝామున జరిగిన ప్రమాదం వాళ్లబతుకులను చీకటి పాల్జేసింది. ఎవర్ని బాధ్యులను చేయాలి? కార్మికుల భద్రతను గాలికొదిలేస్తున్నది సర్కరీ వైఫల్యమా లేక యాజమాన్యాల నిర్లక్ష్యమా? పరిశ్రమల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతతో కార్మికుల ప్రాణాలు బుగ్గిపాలవుతున్నాయి. అనుమతులు లేకుండా ఏండ్ల తరబడి యాజమాన్యాలు పరిశ్రమలను నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

పరిస్థితిలో మార్పు వచ్చేదెన్నడూ..
యజమానులు రాజకీయ నాయకుల అండతో, అవినీతి అధికారుల తోడ్పాటుతో ఇష్టా రాజ్యంగా కంపెనీలు కొనసాగి స్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కార్మికుడి సంక్షేమం పట్టని దేశం అభివృద్ధి పథంలో నడవ లేదు. ఎందుకంటే తమ రక్తాన్ని ధారపోసి ఈ ప్రపంచాన్ని నిర్మించుకుంటున్న కార్మికుడి భద్రతను పట్టించుకోని సమాజాలు ఏ మాత్రం ముందడుగు వేయలేవు. కానీ, దురదృష్టవశాత్తూ ఇప్పుడు కార్మికుడు తన ఉద్యోగ భద్రత కోసం, ప్రాణ రక్షణ కోసం పోరాడాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చిన నాడే నిజమైన అభివృద్ధి జరిగినట్టవుతుంది. పూర్తి విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss