నిరంకుశత్వమా? అసహనమా?

20:09 - August 21, 2017

అది నిరసనలకు అడ్డా.. ఆందోళనలకు ఊపిరి.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు ఉదాహరణ. కానీ, ప్రభుత్వం... నిరసనలే కదా.. ఎక్కడ చేస్తే పోయేదేంటి అంటోంది. ఆందోళనలు ట్రాఫిక్ కి అడ్డం అంటోంది. ఇందిరా పార్క్ లాంటి చోట కాదు.. ఊరిబయట మీ బాధలను వెళ్లగక్కుకోండి అంటోంది. ఇది నిరంకుశత్వమా? అసహనమా? లేక ప్రజబాహుళ్యంనుండి విమర్శలను ఎదుర్కోలేని అశక్తతా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..

మమ్మల్ని విమర్శించే గళాలకు ఇక్కడ చోటు లేదు.. మా విధానాలకు తప్పు పట్టే రాజకీయపక్షాలకు స్థానంలేదు. వాళ్లను ఊరిబయటకు నెట్టేస్తాం.. బంగారు తెలంగాణకు వ్యతిరేకమని తెలంగాణ ద్రోహులని తేలుస్తాం.. ఇవేనా తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు..అసహనం.. అడుగడుగునా అసహనం..ఏ ప్రజా ఉద్యమాలను ఆసరాగా చేసుకుని తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చారో.... ఆ ఉద్యమాలనే అణచివేసే ప్రయత్నం... ఏరు దాటి తెప్పతగలేసిన తీరుగా... నిరసన స్వరాలను అణచివేసే ప్రయత్నం కెసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహామహా నగరాలకే లేని సమస్య ఇప్పుడు హైదరాబాద్ లో ఉందంటోంది ఇక్కడి సర్కారు..

ధర్నాచౌక్ ట్రాఫిక్ జామ్ లకు కారణంగా మారుతోంది.. ధర్నా చౌక్ వల్ల స్థానికులకు ఇబ్బంది కలుగుతోంది. అయినా, అసలు ధర్నా చౌక్ ఎక్కడుంటే ఏమిటి ఇవీ సీఎం చెప్తున్న మాటలు. మరి కెసీఆర్ వాదనలో సహేతుకత ఎంత? ధర్నా చౌక్ తరలింపుతో వచ్చే నష్టం ఏమిటి?. అసహనం.. అడుగడుగునా అసహనం.. వామపక్షాలు సూటిగా నిలదీస్తున్న సమస్యలకు సమాధానం ఇవ్వలేని అశక్తత తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ దిశగా నడిపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రజా ఉద్యమాలు, వామపక్ష పోరాటాలను విలువను ఊకదంపుడు ఉపన్యాసాలతో విమర్శలతో తక్కువ చేసే ప్రయత్నాలకు దిగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రజలను ఆకాంక్షలను గౌరవించని ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం కష్టం.. ప్రజల నిరసనలకు స్థానం ఇవ్వని ఏలికల అసహనం అంతిమంగా వారికే చేటుతెస్తుంది. ఇప్పుడు టియ్యారెస్ ప్రభుత్వం ధర్నా చౌక్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామిక మౌలిక లక్షణాలకు వ్యతిరేకం. ఈ తీరు మార్చుకోవాల్సిన అవసరం బలంగా ఉంది. పూర్తి విశ్లేషణ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss