యమకూపం..

21:06 - January 9, 2017

విద్య వ్యాపారంగా మారితే ఇలాగే ఉంటుందా? లేత చిన్నారుల శారీరక మానసిక ఆరోగ్యాలపై తీరని ప్రభావం చూపుతోందా? కరెన్సీ కట్టలు, ర్యాంకులు తప్ప మరేదీ పట్టని ఈ వ్యాపార సంస్థలకు అడ్డుకట్ట వేయలేమా? ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుంటే చూస్తూ ఉండాల్సిందేనా? ఫీజులు ఆకాశంలో, సౌకర్యాలు పాతాళంలో.. ఒత్తిడి ఎవరెస్ట్ అంతఎత్తులో.. దీనివల్ల అంతిమంగా విద్యార్ధులు కుంగిపోతున్నారా? అసలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఏం జరుగుతోంది? ఈ రోజు వైడాంగిల్ స్టోరీలో చూద్దాం.. ప్రభుత్వం నియంత్రించాల్సిన విద్యారంగం కార్పొరేట్ సంస్థల్లోకి జారింది. చదువును అమ్ముకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్న సంస్థలు పుట్టగొడుల్లా బ్రాంచులు పెడుతూ సామ్రాజ్యాన్నే స్థాపించేశాయి. ఇప్పుడు చదువంటే ఒకటి రెండు సంస్థలకే పరిమితమౌతోందా? చదువంటే యమకూపంలో చిన్నారులను నెట్టడమౌతోందా? నిర్లక్ష్యమో లేక పర్యవేక్షణాలోపమో, లేదా.. నిజంగానే తేరుకోలేని అనారోగ్యమో.. ఏదయితేనేం ..ఆ చిన్నారి ఉసురు తీసింది. చివరికి ఆ కుటుంబాన్నే అంతం చేసింది. ఇదొక్కటేనా.. కొన్నేళ్ల చరిత్రలో ఎన్నో ఆత్మహత్యలు.. మరెన్నో దారుణాలు. విద్యాగంధాన్ని పంచుతామంటున్న కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్ధులపై కొండంత ఒత్తిడిని పెంచుతున్నాయా? విద్యా విధానంలో హింస.., ర్యాంకుల వేటలోహింస, అడుగడుగునా హింస.. చిన్న బ్రేక్ తర్వాత.. హింస.. అటు విద్యా విధానంలో హింస..ఇటు ర్యాంకుల వేటలో, విద్యా బోధనలోహింస..తోటి విద్యార్ధులతో ప్రవర్తనలో హింస..అడుగడుగునా ... హింస రాజ్యమేలుతోంది. కొన్ని మనసులు గాయపడుతున్నాయి. కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు.. కొందరు కోట్లలో వ్యాపారం చేస్తున్నారు.. కొందరు అమాయక విద్యార్ధులు బలవుతున్నారు. విద్యాసంస్కృతిలో విషం నిండుతోంది. సమాజం వికాసం చెందటానికి ఏది అవసరమో దాన్ని పూర్తిగా పక్కనపెట్టి, యంత్రాలను తయారు చేసే వ్యవస్థ నడుస్తోంది. మార్కులు, ర్యాంకులు తప్పమరేదీ పట్టని కార్ఖానాల్లో చిన్నారులు నలిగిపోతున్నారు. శారీరకంగా మానసికంగా దుర్బలులుగా అవుతున్నారు. విద్య వికాసాన్ని, బంగారం లాంటి భవితను అందించాలి తప్ప... వ్యాపారంలా మారి చిన్నారుల భవిష్యత్తుని కబళించకూడదు. కార్పొరేట్ కళాశాలలు అటు తల్లిదండ్రుల రక్తాన్ని, ఇట్లు విద్యార్ధుల ప్రాణాలను పీల్చే విష సంస్కృతికి సమాధి కట్టాలి.. ప్రభుత్వం నిద్రమత్తు వదిలించుకుని ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే, మరెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఊహించలేం.. 

Don't Miss