మహిళా..ఎక్కడ సాధికారిత..?

20:45 - February 13, 2017

ఓ ఎమ్మెల్యే స్వయంగా ఓ మహిళపై దాడిచేస్తాడు.. న్యాయం కావాలన్న మహిళల ఉద్యోగాలు పీకేస్తారు.. ప్రశ్నించిన మహిళను అక్రమంగా జైల్లో పెడతారు..ఇంకా మాట్లాడితే బూతులు తిడతారు.. రోడ్డుపై ఈడ్చి కొడతారు. కానీ, వేదికలపై మాత్రం మహిళా సాధికారత అంటూ కబుర్లు ఘనంగా చెబుతారు. మహిళల హక్కులను కాలరాస్తున్న సర్కారు తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక కథనం..దేశంలో మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఈనాటికీ అసమానతలు, వివక్షత ఏయే రూపాల్లో కొనసాగుతున్నాయో ఆ ఊసు లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు.. లేని గొప్పలు.. మాటల కోటలు.. హంగు ఆర్భాటాలు.. పైన పెటారం లోన లొటారం.. ఇంతకు మించి ఏమైనా ఉందా?

వేధిస్తారు..అరెస్టె చేస్తారు..
ఎన్ని దాడులు ఎన్ని ఉదాహరణలు.. ఓ ఎమ్మెల్యే నోటికిచ్చినవన్నీ వాగుతాడు.. మరో ప్రముఖుడు మహిళలకు నిబంధనలు నిర్దేశిస్తాడు.. మరో ఎమ్మెల్యే అనుచరులు దారుణమైన దాడులకు తెగబడతాడు.. ఓ పక్క ఇవన్నీ యధేచ్చగా సాగుతుంటే కాస్తకూడా పట్టని సర్కారు ఇప్పుడు మహిళా సాధికారత.. సదస్సులు అంటూ చేసిన హడావుడి హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస వేతనాలడిగితే వేధిస్తారు.. ఉద్యోగభద్రత కావాలంటే అరెస్టులు చేసి భయపెడతారు..సొంత నియోజకవర్గాల్లో అరాచకం సృష్టిస్తారు. అడుగడుగునా మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తారు. కానీ, సాధికారత పేరుతో వేదాలు వల్లిస్తారు. అన్నీ ఒట్టి మాటలేనా? చెప్పుకోటానికి మాత్రమేనా? నినాదాలన్నీ గాల్లో అరుపులేనా? చేతల్లో కొచ్చేసరికి అంతా ఒకటే అని రుజువు చేసుకుంటున్నారా? మొక్కుబడి వ్యవహారంగా తేల్చేస్తున్నారా? అసలు మహిళలకు రాజకీయ పార్టీలిస్తున్న ప్రాధాన్యత ఎంత? ఎంతమందికి టికెట్లిస్తున్నాయి? చట్టసభల్లో ఎందరికి ఎంట్రీ దొరుకుతోంది? ఇలాంటి పరిస్థితుల్లో సాధికారత సాధ్యమేనా?

మహిళలపై హింస..
ఎక్కడ చూసినా మహిళలపై హింస తాండవిస్తోంది. అడుగడుగునా లైంగిక వేధింపులు.. ఎక్కడ చూసినా అంతులేని గృహహింస.. ప్రేమ పేరుతో అఘాయిత్యాలు.. విద్యావకాశాల్లో వివక్ష.. పనిప్రదేశాల్లో వేధింపులు.. వీటన్నిటికంటే ముందు పుట్టుకనే నిరోధిస్తూ, పిండాన్నే చిదిమేస్తున్న దారుణాలు.. ఒకటా రెండా.. మహిళా లోకంపై జరుగుతున్న దాడులు..అనేకం. ఈ వివక్షను, ఈ దాడుల్ని నిరోధించి ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడిననాడే నిజమైన సమానత్వానికి, సాధికారతకు బాటలు పడతాయి. స్వాతంత్ర్య ఫలాలు అందుకున్నామని సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టి, ఆరు దశాబ్దాలు గడిచింది. మహిళల కోసం అనేక చట్టాలు చేశామని ప్రభుత్వాలు పదే పదే వల్లెవేస్తున్నాయి. మహిళల సంక్షేమమే తమ అజెండా అని ప్రతి పార్టీ నినదిస్తోంది. కానీ, ఆచరణలో మాత్రం ఆ నిబద్ధత శూన్యమని పదే పదే రుజువవుతోంది. మహిళల హక్కులే మానవ హక్కులు అని తీర్మానాలు నినదిస్తున్నాయి.. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను ప్రతిఘటిద్దాం అంటోంది ఐక్యరాజ్యసమితి. అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం మహిళల హక్కు అని ఘోషిస్తున్నాయి అంతర్జాతీయ సదస్సులు. ఇప్పటికైనా వేదికలపై హడావుడికంటే వాస్తవంలో చేతలు మొదలు పెడితే ఫలితం ఉంటుంది. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss