బతకాలనే ఆలోచన ఉందా ? అయితే..

20:21 - October 23, 2017

ఈ భూమిపై మానవ జాతి అడుగులకి ఎన్నేళ్ల వయసుంటుంది? దీనికి రకరకాల ఆధారాలు వెతికి అందాజుగా ఓ అంకె చెప్పగలరు సైంటిస్టులు.. మరి మానవజాతి ఈ భూమ్మీద ఇంకా ఎంత కాలం బతుకుతుంది? చెప్పగలరా? మహా అయితే ఓ వెయ్యేళ్లు మాత్రమే అంటున్నారు సైంటిస్టులు. అవును మరి... పక్కలో బాంబును పెట్టుకుని, పీలిస్తే చచ్చేంత ప్రమాదకర వాయువుల్ని నింపుకుని, తాకితే నాశనమయ్యే రసాయనాల్ని పోగేసుకుని, భూమిని వేలసార్లు భస్మీపటలం చేయగల అణ్వాయుధాలతో దేశాన్ని నింపుకుంటుంటే వెయ్యేళ్లదాకా ఎందుకు ...ఇంకా ముందే సర్వనాశనం జరగొచ్చు.. ఇదే మాట చెప్తున్నారు.. సైంటిస్టులు.. బతకాలనే ఆలోచన ఉంటే ఇంకో గ్రహాన్ని వెతుక్కోమని సలహా కూడా ఇస్తున్నారు.. కూర్చున్న కొమ్మని నరుక్కోవటం అనే మాట చాలా సార్లు వినే ఉంటారు.. ఇప్పుడు అనేక ప్రపంచ దేశాలు అదే పని చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకర విష రసాయనాలు అణ్వాయుధాలు, జీవాయుధాలు పోగేసుకుని తమదే పై చేయి అని మూర్ఖంగా నవ్వుకుంటున్నాయి. కానీ, తాము కూడా ఈ పోటీలో అంతమౌతామనే నిజాల్ని విస్మరిస్తున్నాయి.

జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించకుంటే.. భూమిపై మానవ జీవనం మరో వెయ్యేళ్లకు మించి ఉండదని ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇప్పటికే హెచ్చరించాడు. సాంకేతిక అభివృద్ధిలో దూసుకుపోయేందుకు అవలంబిస్తున్న దుందుడుకు చర్యల వల్ల భవిష్యత్తులో అణు, బయోలాజికల్‌ యుద్ధాలు తప్పవని చెప్పాడు.

విషరసాయనాలు, బయో ఆయుధాలు ఎక్కడ తయారవుతున్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? పనికొచ్చే పరిశోధనలు చేస్తున్నట్టుగా చెప్తూ అండర్ గ్రౌండ్ లో వినాశన కారకాలను తయారు చేస్తున్నారా? అగ్రరాజ్యాల శాస్త్ర సాంకేతిక పరిశోధనలు వినాశనకారకాలుగా మారుతున్నాయా? ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాలు అమెరికా ల్యాబుల్లో తయారయ్యాయా? భవిష్యత్‌లో అణు యుద్ధాలు, జీవరసాయనిక దాడులు తప్పేలా లేవని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంటున్నాడు. సాంకేతిక రంగంలో అనేక దేశాలు అవలంభిస్తున్న చర్యల వల్ల ఈ తరహా యుద్ధాలు తప్పేలా కనిపించడం లేదంటున్నాడు. మరోపక్క అనూహ్యంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ , భూమిపైన అనేక జాతులు అంతరించిపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేషన్ వెరసి మనిషి తన తోకకు తానే నిప్పంటికుంటున్నాడన్నది ఇక్కడ సారాంశం..

ఊరికే ఉన్న ప్రాణానికి ఉరేసుకోవటం అనే మాట ఎప్పుడన్నా విన్నారా? ఇది మానవుడి అభివృద్ధి పరిణామానికి సరిగ్గా వర్తిస్తుంది. పనికొచ్చే ఆవిష్కరణల మాట తర్వాత.. నిండా ముంచే అనేక ప్రమాదాలను మాత్రం తయారు చేసిపెట్టుకున్నాడు. తన వినాశనానికి తానే కారకుడౌతున్నాడు. ఈ లోగా ఏ గురుగ్రహానికో మనుషులు కొందరు షిఫ్టవకపోతే... ఈ భూమిపై మనిషి అనేవాడు త్వరలో చరిత్ర అవ్వకతప్పదు...ఇదీ సైంటిస్టుల మాట. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss