మంచిర్యాల అడవిలో మారణహోమం..

13:42 - January 2, 2017

మంచిర్యాల : అటవీ జంతువులకు రక్షణ కరువైంది...ఒకపక్క జింకలు, దుప్పులు, అడవి పందులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతుంటే... మరో పక్క వేటగాళ్ల ఆగడాలకు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. మంచిర్యాల, కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాల అడవుల్లో జరుగుతున్న మారణహోమంపై ప్రత్యేక కథనం.. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది దట్టమైన అడవీ ప్రాంతం. జిల్లాలో కొండలు, కోనల మధ్య ఉండే సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు, దహేగాం, సిర్పూర్ (టీ), కౌటాల, పెంచికల్, చింతమానె పల్లి మండలాలు దట్టమైన అడవుల మధ్య ఆనుకొని ఉంటాయి. ప్రాణహిత, పెన్‌గంగా, పెద్దవాగు నదులు ఈ మండలాల్లోని గ్రామాలను ఆనుకొని ప్రవహిస్తాయి. దాదాపు సగానికి పైగా గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటాయి. అటు మహారాష్ట్రలో దట్టమైన అడవులు కల్గి ఉండటంతో అడవి జంతువులు గ్రామాల్లోకి, పొల్లాల్లోకి తరచుగా వస్తుంటాయి.

కరెంట్‌ తీగలకు బలవుతున్న జంతువులు..
అడవి జంతువులు గ్రామాల్లోకి రావడంతో వేటగాళ్ల కళ్లు అడవి జంతువులపై పడింది. జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. పొలాలు, అడవులలో వేటగాళ్లు విద్యుత్ తీగలను అమర్చుతున్నారు. రాత్రి వేళల్లో అడవి జంతువులు అటువైపుకు వచ్చి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడుతుంటాయి. అడవి పందులు, దుప్పులు, జింకల వాటిని వేటాడి వాటి మాంసాన్ని ఇతర ప్రాంతాల్లో అమ్మి క్యాష్‌ చేసుకుంటున్నారు.

వేటగాళ్ల ఉచ్చుకు ఆరుగురు బలి..
ఇదీలా ఉంటే మరో పక్క పొలాల్లో వేటగాళ్ళు ఏర్పాటు చేసిన కరెంటు తీగలకు అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. వేటగాళ్లు అటు వన్యప్రాణులతో పాటు ఇటు మనుషుల ప్రాణాలను కూడా బలిగొంటున్నారు. కుమ్రంభీం మంచిర్యాల జిల్లాలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు ప్రాణాలను కోల్పోయారు.

పెద్దపులి సైతం విద్యుత్ తీగలు తగిలి మృతి..
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పశువులు, మేకలు లెక్కలేనన్ని బలయ్యాయి. నెలరోజుల క్రితం మచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పెద్దపులి మరణించింది. ఈ విషయం బయటకు పొక్కకుండా పులి శవాన్ని వేటగాళ్లు అడవిలోనే పూడ్చిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత విషయం బయటకు రావడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అటవీశాఖ అధికారులు..
వారం రోజుల క్రితం కుమ్రంభీం జిల్లా బెజ్జూర్ మండలం మద్దిగూడ గ్రామంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి శంకర్ అనే వ్యక్తి మృతిచెందాడు. గుట్టుచప్పుడు కాకుండా శంకర్ మృతదేహాన్ని వేటగాళ్లు దగ్గరలోని పెద్దవాగు ఒడ్డున పూడ్చిపెట్టి భయంతో పోలీసులకు లొంగిపోయారు. గత వారం రోజులుగా వణ్య ప్రాణులను వేటాడడానికి విద్యుత్ తీగలను అమర్చే క్రమంలో మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలలో కొత్తపల్లి పాపయ్య, ముత్తయ్య అనే వ్యక్తులు మృతిచెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే వారంలో ముగ్గురు వ్యక్తులు విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు. అటవీ ప్రాంతాల్లో వేటగాళ్ల ఉచ్చులకు ఎన్నో ప్రాణాలు బలవుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్ధానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Don't Miss