ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం..

07:26 - October 2, 2017

సంగారెడ్డి : మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. అధికారులు లైసెన్స్ జారీ చేయడం, టెండర్లు దక్కినవారు వ్యాపారాన్ని ప్రారంభించడమే మిగిలింది. కాని ఓ షాపు యజమాని మాత్రం అత్యుత్సాహంతో అనుమతులు రాకుండానే నిర్మాణాలు చేపట్టాడు. దీంతో కాలనీవాసులు యజమానితో గొడవకు దిగారు. సంగారెడ్డి జిల్లా గణేష్‌ నగర్‌ కాలనీలోని కలెక్టరేట్‌కు కొద్ది దూరంలోనే మద్యం దుకాణం కోసం జరుపుతున్న నిర్మాణం. ఈ నిర్మాణానికి మున్సిపల్‌ శాఖ అనుమతి లేదు. ఎక్సైజ్‌ శాఖ కూడా లైసెన్స్‌ను మంజూరు చేయలేదు. కాని టెండర్‌ దక్కించుకున్న యజమాని మాత్రం అట్టహాసంగా నిర్మాణాలు ప్రారంభించాడు. అయితే పర్మిషన్‌ లేకుండా నిర్మాణాలు జరపడంతో మున్సిపల్‌ అధికారులు ఆదేశాలు ఇచ్చి ఈ నిర్మాణాలను కూల్చివేశారు. అప్పటికీ అధికారుల ఆదేశాలను పట్టించుకోని యజమాని తిరిగి మళ్లీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాడు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ సిబ్బందిని పంపి నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ చేపట్టారు.

అయితే అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల మధ్యలో దుకాణాలు ఏర్పాటు చేయడంపై గణేష్‌ నగర్‌ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని సమస్యలు పట్టించుకోని కౌన్సిలర్‌ గోవర్దన్‌ నాయక్‌ అక్రమ నిర్మాణాలకు ఎలా అనుమతిస్తారని వారు మండిపడ్డారు. కాలనీవాసులతో గొడవకు దిగిన మద్యం షాపు యజమాని నిర్మాణాన్ని ఎలా అడ్డుకుంటారంటూ ఎదురుతిరిగాడు. అనుమతులు తెచ్చుకున్నా నిర్మాణాలు ఆపడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెండర్ తెచ్చుకున్నందుకే పరిస్థితి ఇలా ఉంటే ఇక అనుమతులు ఇస్తే పరిస్థితి ఏంటి అని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. 

Don't Miss