అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారు: జగన్

15:21 - March 20, 2017

అమరావతి :అధికార పార్టీ తప్పుడు లెక్కలతో అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ గరవ్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ... రెయిన్ గన్స్ బాగా పనిచేస్తే అనంతపురంలో కరువు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌భుత్వం ఖ‌ర్చు పెట్ట‌క‌పోయినా పెట్టేసిన‌ట్లు చూపిస్తోంద‌ని జ‌గ‌న్ అన్నారు. గ‌తంలోనూ చంద్ర‌బాబు ఎల్లంప‌ల్లి విష‌యంలో స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారని అన్నారు. ఇప్పుడు కూడా ఎన్నో అంశాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని, సాంఘిక సంక్షేమ శాఖ‌, గిరిజ‌న సంక్షేమ శాఖ ఏది తీసుకున్నా అన్ని విష‌యాల్లోనూ అస‌త్యాలే ప‌లికార‌ని జగన్ అన్నారు. కాపు కార్పోరేష‌న్‌కు కూడా వెయ్యికోట్లు కేటాయించిన ప్ర‌భుత్వం అందులో  338 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని చెప్పారు. గ‌త ఏడాది బ‌డ్జెట్‌లో చేసిన‌ కేటాయింపుల‌కు, ఖ‌ర్చుల‌కు అస‌లు పొంత‌నే లేద‌ని అన్నారు దీని పై అధికార పక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. దీంతో సభలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా వైసీపీ నేతలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

 

Don't Miss