కాకినాడ బీచ్ ఫెస్టివల్ పనుల్లో అలసత్వం

15:13 - January 8, 2017

కాకినాడ : ఏపీలో బీచ్ ఫెస్ట్ సందడి మొదలవుతోంది. ఏటా సంక్రాంతికి.. నిర్వహించే సాగర సంబరాలకు.. తీరప్రాంతాలు సిద్ధమవుతున్నాయి. అయితే కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఫెస్ట్ పనులు నత్తనడకన సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ బీచ్ ఫెస్టివల్ పనుల్లో అలసత్వంపై టెన్ టీవీ ప్రత్యేక కథనం. 
నత్తనడకన సాగుతున్న పనులు  
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెల రెండు పండుగలను తెస్తోంది. ఒకటి సంక్రాంతి అయితే.. రెండోది సాగరతీరంలో నిర్వహించే బీచ్‌ ఫెస్టివల్‌. సాగరతీర పండుగ కోసం.. సముద్రతీర ప్రాంతాలన్నీ ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ముఖ్యంగా కాకినాడలో బీచ్‌ ఫెస్ట్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. అయితే, పనులు నత్తనడకన సాగుతుండడమే, పండుగ సక్రమ నిర్వహణపై అనుమానాలను పెంచుతోంది. 
కాకినాడ బీచ్ కు పోటెత్తుతున్న పర్యాటకులు  
కాకినాడ బీచ్ నిత్యం పర్యాటకులతో పోటెత్తుతుంటుంది. ఇటీవల టూరిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తగ్గట్టుగా సాగరతీరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కాకినాడ బీచ్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా వచ్చిన 72కోట్ల రూపాయలనూ సాగరతీర అభివృద్ధికి కేటాయించారు. 
అట్టహాసంగా బీచ్ అభివృద్ధి పనులు ప్రారంభం
కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధి కోసం అట్టహాసంగా పనులు ప్రారంభించారు. కానీ అధికార యంత్రాంగం అలసత్వంతో అది ఆరంభశూరత్వంగా మిగిలిపోయింది. 62 ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించింది. పర్యవేక్షణ లేకపోవడంతో పనులన్నీ తూతూమంత్రంగా సాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం 12 వ తేదీన బీచ్ ఫెస్టివల్ నిర్వహించాల్సివుంది. కానీ పనులు ఇప్పటికీ పది శాతం కూడా పూర్తి కాలేదు. 
నాణ్యత ప్రమాణాలను మరిచిపోయిన కాంట్రాక్టర్స్ 
టూరిజం అభివృద్ధిలో భాగంగా పార్క్‌లో లోల్యాండ్ స్కేప్, ఫౌంటేన్లు సహా పలు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే పూర్తయిన పనులు చూస్తే నాణ్యత లేమి ఏమేరకు ఉందో అర్థమవుతుంది. కాంట్రాక్టర్లు కనీస ప్రమాణాలూ పాటించకుండా నాసిరకం పనులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
నాసిరకంగా సాగుతున్న పనులపై విమర్శలు
పనుల నాణ్యతపై పలువురు పెదవి విరుస్తున్నారు. భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే ఈ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 
పూర్తికాని బీచ్ అభివృద్ధి పనులు
మరో వైపు బీచ్ అభివృద్ధి పనులు పూర్తి కాకముందే ఈ ఏడాది బీచ్ ఫెస్టివల్‌ ను ఆడంబరంగా నిర్వహిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఏకంగా మూడు కోట్ల రూపాయల మేర వెచ్చించి ఫెస్ట్‌ను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు మంత్రులు చెబుతున్నారు. అరకోరగా పూర్తయిన పనులకే ప్రారంభోత్సవం కూడా చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పూర్తి కాని పనులను చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభింపచేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అక్కరకు రాకుండా పోతోంది. ఇదే నాణ్యతా లోపాలు కొనసాగితే సుదీర్ఘకాలం అందుబాటులో ఉండాల్సిన పనులు స్వల్పకాలానికే పాడైపోయే పరిస్ధితి కనిపిస్తోంది. 

 

Don't Miss