ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

11:26 - August 10, 2018

హైదరాబాద్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదివాసీలు ఆవేదన చెందారు.  
దేశవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవం 
దేశవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు సంప్రదాయ వేశధారణలో అలరించారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌ ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పార్లమెంట్‌ను కోరినట్లు ఆయన వెల్లడించారు. 
మంచిర్యాలలో 
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఆదివాసీలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. 
నిర్మల్‌ లో
నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి సంప్రదాయ నృత్యాలు చేశారు. ఆదివాసీల సమస్యలు పట్టించకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. 
ఖమ్మంలో 
ఖమ్మంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ వేషధారణలో ఆదివాసీలు అలరించారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో ఆదివాసీలకు పురిటి కష్టాలు తప్పడంలేదు. వర్షం కురిస్తే మల్లన్నవాగు. కిన్నెరసాని వాగులు ఉధృతంగా ప్రవహించడంతో వాగులు దాటలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో గుండాల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
పశ్చిమగోదావరి జిల్లాలో 
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రాపురంలో ఆదివాసీ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకోని భావితరాలకు అందివ్వాలని కోరుతూ ఆదివాసీ సాంప్రదాయ కొమ్ముబూర, డప్పు వాయిద్యాలతో ఆదివాసీసేన ఆధ్వర్యంలో వేలాదిమంది ఆదివాసీలు ప్రదర్శనగా తరలివచ్చారు.  
శ్రీకాకుళం జిల్లాలో
గిరిజనుల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీతం పేట ఏజెన్సీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివాసీ తల్లి విగ్రహానికి పూజలు చేసి ప్రారంభించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడుకునేందుకు ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. 
 

 

Don't Miss