జమిలి ఎన్నికలకు వైసీపీ జై కొట్టింది...

07:51 - July 11, 2018

ఢిల్లీ : జమిలి ఎన్నికలకు వైసీపీ జై కొట్టింది. లోక్‌సభతోపాటే శాసనసభలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు, అవినీతి తగ్గుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపులకు చెక్‌ పడుతుందని జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం సేకరిస్తున్న లా కమిషన్‌ దృష్టికి తెచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వైసీపీ మద్దతు 
లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు వైసీపీ మద్దతు తెలిపింది. ఈ అంశంపై రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం సేకరిస్తున్న లా కమిషన్‌కు  వైపీసీ నాయకులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. వైపీసీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్‌ను కలిశారు. జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్థిస్తూ వైసీపీ అధినేత జగన్‌ రాసిన లేఖను లా కమిషన్‌కు అందజేశారు. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహణలో ఉన్న లాభనష్టాలను  లా కమిషన్‌ దృష్టికి తెచ్చారు. 1951 నుంచి 1967 వరకు, 1999 నుంచి 2014 వరకు లోక్‌సభతోపాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. దీని వలన ఖర్చు, అవినీతి తగ్గుతుందని సూచించింది. వేర్వేరు ఎన్నికలతో అభివృద్ధి కుంటుపుడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
జమిలి ఎన్నికల్లో లాభనష్టాలను లా కమిషన్‌ దృష్టికి తెచ్చిన వైసీపీ 
ఐదేళ్లకు ఎన్నికైన ప్రభుత్వాలు అర్ధాంతరంగా మధ్యలో కూలిపోతే అప్పుడు పరిస్థితి ఏంటన్న అంశంపై వైసీపీ నాయకులు లా కమిషన్‌ వివరణ కోరారు. రాజ్యసభ ఎన్నికల తరహాలోనే మిగిలివున్న కాలానికే ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాటు ఉంటుందని లా కమిషన్‌ స్పష్టం చేసింది. జమిలి ఎన్నికల్లో ఉన్న లాభనష్టాలను కూడా వైసీపీ నాయకులు లా కమిషన్‌ దృష్టికి తెచ్చారు. ఈ విధానంలో జాతీయ  పార్టీల ప్రాధాన్యత పెరిగి... ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత తగ్గుందన్న అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ టికెట్‌పై ఎన్నికల్లో నెగ్గి, టీడీపీలో చేరిన 23 మంది  ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల విషయాన్ని విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్‌ దృష్టికి తెచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి ఫిరాయింపులకు ఆస్కారంలేకుండా రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని సూచించారు. మరోవైపు రెండు రోజుల  క్రితం లా కమిషన్‌ను కలిసిన టీడీపీ నాయకులు జమిలి ఎన్నికలను వ్యతిరేకించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న  టీఆర్‌ఎస్‌ జమిలిని సమర్ధించింది. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్‌, సీపీఐ, ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ, డీఎంకే జమిలిని వ్యతిరేకించాయి.

 

Don't Miss