ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ నేతల అసంతృప్తి

19:12 - September 3, 2017

విజయవాడ : ప్రశాంత్‌ కిషోర్‌ను తమ పార్టీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు వైఎస్‌ జగన్‌. గతంలో కిషోర్‌ ట్రాక్‌ రికార్డును చూసి పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ప్లీనరీలో పార్టీ కార్యకర్తలకు ప్రశాంత్‌ కిషోర్‌ను పరిచయం చేశారు జగన్‌. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మనకి దిశానిర్దేశం చేసి 2019లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తారని తెలిపారు. ప్లీనరీలో చెప్పినట్టుగానే పార్టీలో కీలకమైన అభ్యర్థుల ఎంపికను కిషోర్‌కు అప్పగించారు జగన్‌. ప్లీనరీ అనంతరం రంగంలోకి దిగిన కిషోర్‌ ఎమ్మెల్యేల దగ్గరి నుండి ఇంఛార్జ్‌ల పనితీరును నియోజక వర్గాల వారీగా సర్వేలు నిర్వహించారు. వాటి ఆధారంగా వచ్చే ఎన్నికల్లో చాలా మందికి టికెట్స్‌ రావనే ప్రచారం పార్టీలో జోరందుకుంది. అప్పటి నుండి కిషోర్‌పై పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉండి కూడా అనేక పోరాటాలు చేస్తున్నామని, ఇప్పుడు టికెట్‌ కూడా ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటి అని సందిగ్ధంలో ఉన్నారు కొందరు నేతలు. కిషోర్‌ వచ్చాక పార్టీలో సీనియర్‌ మాటలకు విలువ ఇవ్వడం లేదని సీనియర్‌ నేతలు వాదించారు. కీలక సమయాల్లోనూ జగన్‌ కిషోర్‌నే అనుసరిస్తున్నారని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఓటమికి కారణం కిషోరే
నంద్యాల ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం కిషోరే అన్న భావనలో ఉన్నారు పార్టీ నేతలు. నంద్యాల ప్రచారం, జగన్‌ ప్రసంగాలన్నీ కిషోర్‌ అధ్వర్యంలోనే జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎంపై జగన్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీ ఓటమికి కారణంగా చెబుతున్నారు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేయించింది కిషోరే అంటున్నారు పార్టీ నేతలు. లోకల్‌ ఎలక్షన్‌లో కూడా పార్టీ సీనియర్‌ నేతల మాటలు వినకుండా కిషోర్‌ వ్యవహరించారని నేతలంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల మైండ్ సెట్‌, దక్షిణాది ప్రజల మైండ్‌ సెట్‌కి చాలా తేడా ఉంటుందని ఈశాన్య రాష్ట్రాల వ్యూహాలు దక్షిణాదిలో పని చేయవనే వాదనలు పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కిషోర్‌ టీంలో ఉన్న సభ్యుల పట్ల నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కనీస రాజకీయ అవగాహన లేని వ్యక్తులు ఈ టీంలో ఉన్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ లాంటి పటిష్ఠమైన పార్టీని ఎదుర్కోవాలంటే సీనియర్ల సలహాలు పాటించాలని నేతలు సూచిస్తున్నారు. మొత్తానికి 2019 ఎలక్షన్స్‌కి నంద్యాల ఎలక్షన్స్‌ సెమీ ఫైనల్‌ అంటూ చేసిన ప్రయత్నం విఫలమవడంతో నేతలు నిరుత్సాహంలో ఉన్నారు. నంద్యాల ఓటమికి కిషోరే కారణమంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో పార్టీ నేతలు, కార్యకర్తల్లో అధినేత జగన్‌ ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తారో చూడాలి. 

Don't Miss