కడప..పులివెందులలో పాలిటికల్ హీట్స్...

09:51 - January 19, 2018

విజయవాడ : మీ నియోజకవర్గంలో ఈసారి గెలుపు మాదే.. కాదు మీ ఇలాఖాలో మాజెండానే ఎగురుతుంది.. ఇదీ ఇపుడు ఏపీలో అధికార, విపక్షపార్టీ నేతల మధ్య నడుస్తున్న డైలాగ్‌వార్‌. పులివెందులలో గెలుపుమాదే అంటున్న టీడీపీ నేతలకు .. కుప్పంలో మేమేపాగా వేస్తామని వైసీపీ నాయకులు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో కడప జిల్లా పులివెందులలో పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. ఏపీలో పొలిటికల్‌ పందెంకోళ్లు డైలాగ్‌లతో ఢీకొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైసీపీ - టీడీపీ అధినేతల మధ్య మాటల యుద్ధం 2019 ఎన్నికలకు సమర సన్నాహం చేస్తోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ, వైసీపీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ముఖ్యంగా వైసీపి అధినేత జగన్ సొంత నియోజకర్గం పులివెందులలో టిడిపి గెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులపై తనదైన వ్యూహాన్ని అమలు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల గడ్డపై పసుపుజెండా ఎగరడం ఖాయం అంటూ ప్రత్యర్థి పార్టీలో కలకలం రేపుతున్నారు. తరచుగా కడప, పులవెందులలోనే ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూ టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. పులివెందులలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు... పదేళ్లు అధికారంలో ఉండి కూడా సోంత ఊరికి నీరు తీసుకురాలేకపోయారని జగన్‌ను టార్గెట్‌ చేశారు.

అటు ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్‌ కూడా టీడీపీ అధ్యక్షుడికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈసారి తమదే విజయమని జగన్ ప్రకటిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు సొంత ఇలాఖా కుప్పం నియోజకర్గంపైన జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారని వైసీపీ నేతలు అంటున్నారు. కుప్పం అసెంబ్లీ స్థానంలో అధికంగా ఉన్న బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు ఫ్యాన్‌గుర్తుపార్టీ లీడర్లు చెప్పుకుంటున్నారు. పాదయాత్రలో భాగంగా బీసీలకు జగన్‌ పలు హామీల వరాలు ఇస్తున్నారు. అంతేకాదు.. ఇన్నాళ్లు కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శింస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానంలో బిసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపి అభ్యర్ధిగా నిలుపుతున్నట్లు జగన్ ప్రకటించారు. అధికారంలోకి వస్తే కుప్పం నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు క్యాబినెట్ లో అవకాశం ఇస్తామని జగన్ ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా టైం ఉన్నా.. అధికార, ప్రతిపక్షపార్టీ అధినేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో పాలిటిక్స్‌ను వేడెక్కించారు. దీంతో అటు కుప్పుంలోనూ, ఇటు పులివెందులలోనూ ఈసారి గెలుపు ఎవరిదనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి 2019 ఎన్నికల్లో ఓటరు మహాశయుడు ఎవరికి ఎలాంటి ఫలితం ఇస్తారో వేచి చూడాల్సిందే.  

Don't Miss