అంతా ఇసుక దొంగలే..

21:26 - June 12, 2018

తూర్పుగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అవినీతి, అధర్మపాలన సాగుతోందని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడకపోతే రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత వెనుకుబడిపోయే ప్రమాదం ఉందని జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే నీతి, నిజాయితీ పాలన అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని, పెదబాబు, చినబాబు సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు అధికారులు కూడా దోచుకుతింటున్నారని తూర్పుగోదావరి ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ ఆరోపించారు.

తూర్పుగోదావరికి జగన్ యాత్ర..
వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో యాత్ర పూర్తి చేసుకుని రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి మీదుగా చారిత్రక రాజమహేంద్రవరంలోకి ప్రవేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశిస్తున్న జగన్‌కు వైసీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. గోదావరి నదిలో కూడా పడవలతో జగన్‌కు స్వాగతం ప్రజలు పలికారు. 2003లో వైఎస్‌ఆర్‌ పాదయాత్రను తలపించే రీతిలో వంతెన పొడవునా ప్రజలు, పార్టీ శ్రేణులు బారులు తీరారు. రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి పొడవునా వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. గుమ్మడికాయ హారతులతో మహిళలు, వేదపండితులు జగన్‌కు స్వాగతం పలికారు.

మాఫియా రాజ్యమేలుతోంది : జగన్
రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్‌... ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. దీనిలో పెదబాబు, చినబాబుకు వాటాలున్నాయన్నారు. రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి, ఎంపీ ముళీమోహన్‌...ఇసుకు మాఫియాగామారి పెదబాబు, చినబాబుకు ముడుపులు చెల్లిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు రాక్షస, దుర్మార్గ పాలన సాగిస్తున్నారని ఆరోపించిన జగన్‌.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మూడు లక్షల రూపాయల వరకు గృహ రుణాలు మాఫీ చేస్తుందని జగన్‌ హామీ ఇచ్చారు. 

Don't Miss