పశ్చిమానికి జగన్ యాత్ర..

21:47 - May 14, 2018

పశ్చిమగోదావరి : వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర మరో చరిత్ర సృష్టించింది. 161 రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లి వద్ద ఏర్పాటు చేసిన 40 అడుగుల స్తూపాన్ని జగన్‌ ఆవిష్కరించారు.

పాదయాత్ర @ 2000 కిమీ
వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఏలూరు శివారు మాదేపల్లిలో 2 వేల కి.మీ. మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా మాదేపల్లిలో ఏర్పాటు చేసిన 40 అడుగుల స్తూపాన్ని జగన్‌ ఆవిష్కరించారు. 2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర ఎనిమిది జిల్లాల్లో పూర్తైంది. 161వ రోజు పశ్చిమగోదావరిలో ప్రవేశించి ఏలూరు చేరుకొంది. పాత బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో... టీడీపీ ప్రభుత్వ విధానాలపై జగన్‌ విరుచుకుపడ్డారు.

సంఘీభావ యాత్రలు
మరోవైపు జగన్‌ పాదయాత్ర 2 వేల కి.మీ. పూర్తైన సందర్భంగా... వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ యాత్రలు నిర్వహించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రల్లో పాల్గొన్నారు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ నాయకులు సంఘీభావ పాదయాత్రలు నిర్వహించారు. తెలుగుదేశం పాలన అవినీతిమయంగా మారిందని ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోనూ వైసీపీ నేతలు సంఘీభావ పాదయాత్రలు నిర్వహించారు. జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విజయనగరం జిల్లాలో వైసీపీ ప్రధాన కార్యదర్శి బొత్స సత్యనారాయణ, పార్టీ నేత కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాదయాత్రల్లో పాల్గొన్నారు. జగన్‌ పాదయాత్ర 2 వేల కి.మీ. మైలురాయిని అధిమించిన సందర్భంగా తూర్పుగోదారి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. మంగళవారం వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘీభావ ర్యాలీలు కొనసాగుతాయి. బుధవారం వైసీపీ నాయకులు తమ తమ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. 

Don't Miss