'హామీ'ల అమలు జగన్ వల్లే సాధ్యం..ఎలా ?

21:23 - August 9, 2018

గుంటూరు : స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని వైసీపీ నేతలు ఆరోపించారు. గుంటూరులో వైసీపీ చేపట్టిన వంచనపై గర్జన సభలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు వైఎస్‌ జగన్ వల్లే సాధ్యమవుతాయని అన్నారు. గుంటూరులోని విఎఆర్‌ గార్డెన్స్‌లో వైసీపీ వంచనపై గర్జన పేరుతో సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు.. నలుపు రంగు దుస్తులతో హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు నీరుగార్చారని వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచిపోయారన్నారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి ప్రదేశ్‌గా సీఎం చంద్రబాబు మార్చారని వైసీపీ మాజీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేశాయన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే వంచనపై గర్జన కార్యక్రమం చేపట్టామన్నారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ప్రధాని మోదీపై తిరుగుబాటు చేస్తున్నామంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా స్టాండ్‌ తీసుకోవడానికి వైసీపీయే కారణమని గుర్తు చేశారు. వంచనపై గర్జన సభ సందర్భంగా సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు వైఎస్‌ జగన్‌తో సాధ్యమవుతాయన్నారు. 

Don't Miss