సమస్యలకు కేంద్రంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ క్యాంప్‌

12:49 - July 12, 2018

కాకినాడ : అధికారుల నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. ఆర్మీ సెలక్షన్స్‌ కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులకు ఇక్కట్లు తప్పలేదు. కాకినాడలో కనీస జాగ్రత్తలు పాటించకుండా అధికారులు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కాకినాడలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ క్యాంప్‌ సమస్యలకు కేంద్రంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ నాలుగు రోజులుగా క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. ట్రాక్‌ సరిగా లేకపోవడంతో బురదలో అభ్యర్థులు పడుతోన్న కష్టాలు వర్ణనాతీతం. కొందరు అభ్యర్థులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

ఇక దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి వసతుల్లేవు. కనీసం మరుగుదొడ్ల ఏర్పాట్లు కూడా చేయలేదు అధికారులు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అభ్యర్ధులు చెబుతున్నారు. రాత్రి పూట బస చేయడానికి అవకాశం లేకపోవడంతో రోడ్లపైనే విశ్రమించాల్సి వస్తుందంటున్నారు. 

పెద్ద సంఖ్యలో యువత తరలిరావడంతో హోటళ్లు, లాడ్జీలలో రేట్లు అమాంతం పెంచేశారు. దీంతో అభ్యర్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన అధికారులు అభ్యర్థులకు కనీస జాగ్రత్తలు చేపట్టడంలో విఫలమయ్యారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Don't Miss