ప్రత్యేక్ష పోరుకు సిద్ధమన వైసీపీ

21:33 - February 13, 2018

నెల్లూరు : వైసీపీ అధినేత జగన్‌.. కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కలిగిరిలో పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. కేంద్రానికి అల్టిమేటం లాంటిది జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే సంజీవని అని. కేంద్రం హోదా ఇచ్చేవరకూ పోరాడతామని స్పష్టం చేశారు జగన్‌. పార్లమెంటు బడ్జెట్‌ మలివిడత సమావేశాలు ప్రారంభమయ్యే నాటి నుంచి దశలవారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మార్చి 1న పార్టీ ప్రజాప్రతినిధులతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. తర్వాత మార్చి 3న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలతో భేటీ నిర్వహించి... మార్చి 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారు
ఇక మార్చి 5నుంచి మళ్లి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారని జగన్‌ తెలిపారు. ఏప్రిల్ 6వరకు పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సభలో ఎంపీలు నిరసన కొనసాగిస్తారని.. అప్పటికీ కేంద్రం స్పందించకుంటే.. ఏప్రిల్ 6న తమపార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైసీపీ అధినేత ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎద్దేవా
వైసీపీ అధినేత జగన్‌ చేసిన ఈ ప్రకటనను తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎద్దేవా చేశారు. గతంలోనూ జగన్‌ ఇలాంటి ప్రకటనలు చేసి వెనక్కు తగ్గారని విమర్శించారు. రాజీనామాలకు జగన్‌ ప్రకటించిన తేదీకి రాజీనామాలు సమర్పించినా.. అవి ఆమోదం పొందేందుకు రెండు మూడు నెలలు పడుతుందని ఆలోపే సాధారణ ఎన్నికలు వస్తాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. మొత్తానికి, ప్రత్యేక హోదా నినాదంతో జగన్‌ చేసిన తాజా ప్రకటన.. ఎపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది.

Don't Miss