నవంబర్‌ 2 నుంచి జగన్‌ పాదయాత్ర

21:57 - October 11, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ ...తాను చేపట్టబోయే పాదయాత్ర విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. పాదయాత్రపై పార్టీ నేతల నుంచి సలహాలు-సూచనలు తీసుకుంటున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే... స్థానిక సమస్యలపై ఫోక్‌స్‌ చేయాలని జగన్‌ నిర్ణయించారు.
తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత పాదయాత్ర ప్రారంభం  
నవంబర్‌ రెండో తేదీ నుంచి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేయబోతున్నారు.. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. 125  నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుంది. ఈ మేరకు జగన్‌.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ సమన్వయ కర్తలతో సమావేశమయ్యారు. పార్టీ నేతల నుంచి సలహాలు-సూచనలు తీసుకున్నారు. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇతర జిల్లాల్లో ప్రజా సమస్యలపై సభలు-ధర్నాలు నిర్వహించాలని జగన్‌ నేతలకు చెప్పారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నం 
ఈ పాదయాత్ర ద్వారా వైసీపీ శ్రేణుల్లో జోష్‌ నింపడంతో పాటు.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలని జగన్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు పడుతున్న ఇబ్బందులు- నిరుద్యోగుల సమస్యల విషయంలో.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిసైడ్‌ అయ్యారు. 
మినహాయింపు వచ్చినా.. రాకున్న పాదయాత్ర
అయితే ఆస్తు కేసులో జగన్‌ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. పాదయాత్ర సందర్భంగా దీనిపై మినహాయింపు ఇవ్వాలని కోర్టులో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు నుంచి మినహాయింపు వచ్చినా.. రాకపోయినా.. పాదయాత్ర చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఉండేందుకు మరోసారి జగన్‌ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. 

Don't Miss