ఏసీబీ, సీబీఐల వివాదం..ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు..

17:17 - December 1, 2018

అమరావతి : ఏపీలో వరుసగా ఏసీబీ దాడులు నిర్వహించటంతో సీఎం చంద్రబాబు నాయుడు వీటికి చెక్ పెడుతు..సీబీఐకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన విషయం తెలిసిందే.  ఎన్డీయేలోంచి బైటకొచ్చిన సమయం నుండి ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ఏపీ నేతలు తరచు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐని రాజకీయ దాడులకు వాడుకుంటోందని ఆరోపిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
ఈ నేపథ్యంలో ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఏపీ అవినీతి నిరోధక శాఖ మచిలిపట్నంలో రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంది. దీంతో ఏపీలో ఏసీబీ వర్సెస్ సీబీఐగా మారింది. సదరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అవినీతి వ్యవహారంపై సీబీఐ విచారించాల్సి ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం సమాచారం లీక్ చేయడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారని సీబీఐ వ్యాఖ్యానించింది. ఏసీబీ, సీబీఐ మధ్య సహకారం లేకపోతే అవినీతిని అరికట్టడం కష్టమని సీబీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. 
కాగా సీబీఐ ఉన్నతాధికారుల వాదనను ఏపీ ఏసీబీ అధికారులు తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అవినీతిపై తమకు పక్కా సమాచారం అందిందనీ..ఆ ఆధారంతోనే దాడులు నిర్వహించి పక్కా ప్లాన్ తో అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టమని తేల్చిచెప్పారు. మరోవైపు కేంద్రానికి చెందిన సీబీఐ, రాష్ట్రానికి చెందిన ఏసీబీ మధ్య తాము చిక్కుకుంటామన్న భయంతో కేంద్ర ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై వీరంతా చర్చించి ఎక్సైజ్ కమీషనర్ తోనూ కూడా భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య పోరులో తమను బలిపశువులను చేసే కుట్ర జరుగుతోందని నేతలు వ్యాఖ్యానించారు.

 

Don't Miss