ఎంత బేరం పెట్టారో : లావణ్య కారు నిండా పాసు పుస్తకాలే

Submitted on 12 July 2019
ACB rides Tahsildar Lavanya : Passbooks filled with her car

ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తహసీల్దార్‌ లావణ్యకు సంబంధించిన ప్రైవేట్ కారులో తనిఖీలు నిర్వహించిన అధికారులు పదుల సంఖ్యలో పట్టాదారు పాసు పుస్తకాల్ని గుర్తించారు. వీటిలో కొన్ని 2008 సంవత్సరానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అన్ని పాస్ పుస్తకాలు కారులో ఎందుకున్నాయి? ఏమైనా నగదు సంప్రదింపులు జరిగాయా? అడిగిన మొత్తం ఇవ్వకపోవడం వల్లే పాస్‌ పుస్తకాలు వారికి ఇవ్వకుండా తహసీల్దార్‌ తన వద్దే పెట్టుకున్నారా? అన్న కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. పాస్‌ పుస్తకాలతోపాటు పదుల సంఖ్యలో దరఖాస్తులను అధికారులు గుర్తించారు. అలాగే ఆమె రియల్‌ ఎస్టేట్‌లోనూ పెట్టుబడులు పెట్టారని నిర్ధారించుకున్నారు. వాటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో పేరు నమోదు కోసం ఓ రైతు నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లాకి చెందిన వీఆర్వో అనంతయ్య ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. రూ.8 లక్షలు డిమాండ్‌ చేసిన వీఆర్వో.. దాంట్లో రూ.5 లక్షలు తహసీల్దార్‌ లావణ్య వాటా అని చెప్పాడు. వెంటనే ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ లావణ్యను విచారించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని లావణ్య వాదించారు. అనుమానం వచ్చి ఆమె ఇంట్లో సోదాలు చేస్తే.. ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంట్లో ఎక్కడ చూసినా రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలు. బీరువాలు, కప్‌ బోర్డుల్లో కరెన్సీ కట్టలు. రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు లభించాయి. హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని శాంతినగర్‌లో తహసీల్దార్ లావణ్యకు ఖరీదైన ఫ్లాట్‌ ఉంది. ఆ ఇంట్లో ఇవన్నీ దొరికాయి.

ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత భారీ ఎత్తున క్యాష్ ఉండడం పదేళ్ల కాలంలో ఇదే తొలిసారని ఏసీబీ అధికారులు చెప్పారు. లావణ్య.. 2016 నుంచి కేశంపేట తహసీల్దారు. ఆమె భర్త జీహెచ్‌ఎంసీలో సూపరింటెండెంట్‌. ఇంకా ఏవైనా అక్రమాలు జరిగాయేమోనని కేశంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. అనంతయ్యతో పాటు లావణ్యపై కేసు నమోదు చేశారు. వీఆర్వోని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచాక జైలుకి తరలించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయపల్లి వీఆర్వోగా పని చేసిన అనంతయ్య.. ఇటీవలే బదిలీపై కొందుర్గుకు వచ్చారు.

ACB
Rides
Tahsildar Lavanya
Passbooks
Car
rangareddy


మరిన్ని వార్తలు