వాయు గండం : గుజరాత్‌ తీరానికి చేరువలో తుఫాన్

Submitted on 13 June 2019
Air hurricane near the coast of Gujarat

వాయు తుఫాన్ గుజరాత్ తీరానికి దగ్గరగా వచ్చేసింది. మరికొద్ది గంటల్లో తీరాన్ని తాకబోతోంది. తీరాన్ని దాటే సమయంలో ప్రచండగాలులతో ప్రళయాన్ని సృష్టించబోతోంది. దీంతో తీరప్రాంత వాసులు భయంగుప్పిట్లో బతుకుతున్నారు. అటు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేయడంతోపాటు నష్టనివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది.

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయు తుఫాను మరింత బలం పుంజుకుంటూ గుజరాత్ తీరానికి చేరుకుంటోంది. దీని ప్రభావంతో ఇప్పటికే ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. మరికొద్దిగంటల్లో ఈ తుఫాన్ పోరుబందర్‌-మహువా మధ్యలో తీరం దాటే అవకాశం ఉండటంతో ... దీని ప్రభావాన్ని తట్టుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. 

వాయు తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 155-170 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీసే అవకాశం ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు... పలువురు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 

ముందు జాగ్రత్తగా ఇవాళ పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మూడు రోజుల పాటు పర్యాటకులు ఎవరూ గుజరాత్‌ రావద్దని.. ప్రస్తుతం ఉన్న వారు పర్యటనకు వెళ్లవద్దని కోరారు. తీర ప్రాంతాల్లో నడిచే రైళ్లన్నిటినీ రేపు ఉదయం వరకు నిలిపివేశారు. విమానయానశాఖ కూడా తమ స‌ర్వీసుల‌ను నిలిపివేసింది.

మరోవైపు వాయు తుఫాన్ ప్రభావానికి అల‌లు ఎగిసి పడుతుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పోర్‌బంద‌ర్ స‌మీపంలో స‌ముద్రం దాదాపు 30 మీట‌ర్ల వ‌ర‌కు ముందుకు వచ్చింది. ఆరు మీట‌ర్ల ఎత్తువ‌ర‌కు అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. వాయు తుఫాన్‌ ఎఫెక్ట్‌ మహారాష్ట్రపై కూడా ఉండే అవకాశం ఉండటంతో ఆ రాష్ట్రప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. తీర ప్రాంతాల్లోని అన్ని బీచ్‌లను మూసివేసింది.
 

Air hurricane
Near
Gujarat
coast
Red alert

మరిన్ని వార్తలు