తేలిన సీట్ల కసరత్తు..హైదరాబాద్ లోనే ప్రకటన..

07:13 - November 9, 2018

ఢిల్లీ : మహాకూటమి సీట్ల కేటాయింపు ఎట్టకేలకు తుది అంకం పూర్తయ్యింది. టీఆర్ఎస్ పార్టీని ఓడించే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంకం పూర్తయింది. మొత్తం 119 స్థానాలకు గాను 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా... మిత్రపక్షాలైన టీడీపీకి 14, టీజేఎస్ కు 8, సీపీఐకి 3 స్థానాల చొప్పున కేటాయించారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క సీటును కేటాయించే అవకాశం ఉంది. సీపీఐకి వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్లను కేటాయించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్న పార్టీల మధ్య సీట్ల కేటాయింపు దాదాపు ఖరారయింది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు కుంతియా గురువారం దిల్లీలో వెల్లడించారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. మిత్రపక్షాలకు పోగా కాంగ్రెస్‌కు మిగిలే 93 స్థానాల్లో 74 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఈ జాబితాకు పార్టీ అధిష్ఠానం గురువారం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయిస్తే కాంగ్రెస్‌ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చిన స్థానాల్లో ఒక స్థానాన్ని తగ్గించుకొని 73 స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తుంది. మొత్తంగా 93 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. అయితే తమకు కనీసం నాలుగు సీట్లైనా కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది.

కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసంలో గురువారం సాయంత్రం భేటీ అయింది. ఈ నెల ఒకటో తేదీన 57 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన కాంగ్రెస్‌ సీఈసీ తాజాగా మరో 17 స్థానాలకు పేర్లను ఖరారు చేసింది. దీంతో మొత్తంగా 74 స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు పూర్తయ్యింది. వీరందరితో కూడిన తొలి జాబితాను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. కాంగ్రెస్‌ సీఈసీ సమావేశంలో సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఈసీ సభ్యులు అశోక్‌ గెహ్లోత్‌, ఏ.కె.ఆంటోని, అహ్మద్‌ పటేల్‌, గిరిజా వ్యాస్‌, జనార్దన్‌ ద్వివేది, వీరప్ప మొయిలీ, ముకుల్‌ వాస్నిక్‌, ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌, స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌, కమిటీ సభ్యులు శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్‌.సి.కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం కుంతియా మాట్లాడుతూ కూటమిలోని మిత్రపక్షాలకు 25 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

టీజేఎస్ కు కేటాయించిన స్థానాలు, పోటీ చేయబోయే అభ్యర్థులు వీరే...
మెదక్ - జనార్దన్ రెడ్డి
సిద్ధిపేట - భవానీరెడ్డి
దుబ్బాక - రాజ్ కుమార్
వరంగల్ ఈస్ట్ - ఇన్నయ్య
మల్కాజ్ గిరి - దిలీప్
మహబూబ్ నగర్ - రాజేందర్ రెడ్డి.

చెన్నూరు, మిర్యాలగూడల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ అధినేత కోదండరామ్ పోటీకి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

Don't Miss